సామాన్య మహిళలకే కాక ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. రెండు రోజుల క్రితం.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ ఆగంతుకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాక.. పట్టుకోవడానికి ప్రయత్నించిన స్వాతి మలివాల్‌ను కారుతో కొంత దూరం లాక్కెళ్లాడు. ఈ సంఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదికూడా హైదరాబాద్‌లో. అర్థరాత్రి మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబాటుకు యత్నించటం సంచలనం సృష్టించింది. అతడి రాకను గమనించిన సదరు ఐఏఎస్ అధికారిణి గట్టిగా కేకలు వేయటంతో భద్రతా సిబ్బంది.. సదరు డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్.. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థానంలో పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. పలు అంశాలపై ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు చేస్తుంటుంది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్ రెడ్డి అనే డిప్యూటీ తహసీల్దార్ గతంలో ఒకటి, రెండు సార్లు.. స్మితా సబర్వాల్ ట్వీట్లను రిట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకుని.. తన ఉద్యోగం విషయమై చర్చించాలని భావించాడు.
ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో డిప్యూటీ ఎంఆర్‌ఓ ఆనంద్.. స్మితా సబర్వాల్ ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్లాడు. తాను ఫలనా ఇంటికి వెళ్లాలని ఎలాంటి భయం బెరుకు లేకుండా చెప్పటంతో అతడిపై సెక్యూరిటీ వారికి ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో అతడిని లోనికి పంపించారు. ఇక నేరుగా ఐఏఎస్ ఇంటికి చేరుకున్న ఆనంద్ కుమార్ రెడ్డి డోర్ కొట్టాడు. అయితే తలుపు తీశాక.. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియకపోవడంతో స్మితా సబర్వాల్ షాకయ్యారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చిన ఆగంతకుడు ఎవరా అని కంగారు పడ్డారు.
వెంటనే తేరుకుని.. ఎవరు మీరు.. మిమ్మల్ని లోపలికి ఎవరు పంపారు.. ఈ టైంలో రావడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఆనంద్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా.. తాను మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్‌ని అని.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు. అతడి తీరుపై స్మితా సబర్వాల్ మండిపడ్డారు. ఉద్యోగం గురించి మాట్లాడటానికి సరాసరి ఇంటికి రావడం.. అది కూడా అర్థరాత్రి రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంద్ తీరు అనుమానస్పదంగా ఉండటంతో గట్టిగా కేకలు వేశారు.
స్మితా సబర్వాల్ కేకలు విన్న వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంట వచ్చిన స్నేహితుడితో పాటు.. కారులో తీసుకుని వెళ్లి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ కుమార్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఉద్యోగం విషయం గురించి మాట్లాడాల్సి ఉంటే ఏ కార్యాలయానికి వెళ్లకుండా అర్థరాత్రి ఇంటికి వెళ్లటంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
దీనిపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ‘‘రాత్రి భయానక అనుభవం ఎదురయ్యింది. ఓ ఆగంతకుడు నా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించాను. మనం ఎంత సురక్షితంగా ఉన్నా నిత్యం డోర్, లాక్‌ను చెక్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 100కు కాల్ చేయండి అని తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.