దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షించనుంది.
ఇదే విషయంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులను క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. దీంతోపాటు కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ పై అలర్ట్ అయింది. మరోసారి ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ట్యాంక్ బండ్, చార్మినార్ ల వద్ద నిర్వహించే ఫన్ డే ను రద్దు చేసింది. స్కూళ్లు, కాలేజీలలో పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
సినిమా థియేటర్లు, మాల్స్, పబ్స్, మార్కెట్లు తదితర ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆమె శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్స్‌కు పంపించామని చెప్పారు. విదేశాల నుంచి ఇప్పటి వరకు 325 మంది రాగా అందులో ఈ మహిళకు పాజిటివ్ వచ్చిందని.. ఆమెను టీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లండించారు. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇక డిసెంబర్ చివరి వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. అందరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్ ధరించకపోతే ఫైన్ వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పని ప్రదేశంలో, పబ్లిక్ ప్లేస్‌లో మాస్క్ తప్పని సరి లేకపోతే ఫైన్ విధిస్తా్మని హెచ్చరించారు. ఎక్కడికీ వెళ్లినా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్లండని సూచించారు.
