సుధీర్ఘపోరాటం అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని, అలుపెరుగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా సిఎం కెసిఆర్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఏ ఆకాంక్షలతోనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ దిశలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పలు రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రైతులను, పేదలను, ఇతర వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ముఖ్యంగా సాగునీరు, త్రాగు నీరు సమస్యను తీర్చి ప్రజల మెప్పును పొందారు. అదే విధంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో హరితహారం అనే ప్రోగ్రామ్ ను తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రతి ఏడాది విరివిగా మొక్కలు నాటుతున్నారు. పల్లె ప్రకృతి వనాల పేరిట గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో హరిత వనాలను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.
అయితే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని నిర్వహించాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఆ రోజున ప్రతి ఒక్క గ్రామం నుంచి జిల్లా వరకు మొక్కలు నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ ఎం డోబ్రియాల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభవార్తనందించారు. జూన్ 19న తెలంగాణ లోని అన్ని జాతీయ పార్కులు, అర్భన్ ఫారెస్ట్ పార్కులు, జూపార్కుల్లో సందర్శకులకు ఉచితం గా ప్రవేశం కల్పించనున్నట్లు ఆర్ ఎం డోబ్రియాల్ వెల్లడించారు.
