గుండెపోటు అనే మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు వస్తోంది. దీని కారణంగా చిన్న వయసు వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
గుండెపోటు.. ఈ మాట వింటేనే ప్రజల గుండెల్లో గుబులు పుడుతోంది. గతంలో అంటే ఆరు పదుల వయసు దాటిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు స్కూల్ కెళ్తున్న పిల్లాడికి కూడా గుండెపోటు వస్తోంది. ఇప్పటికే ఇటీవలి కాలంలో గుండెపోటుతో ఎన్నో ప్రాణాలు పోయాయి. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందికి ఈ గుండెపోటుకు బలౌతున్నారు. ఏం జరుగుతోందో తెలిసేలోపే ప్రాణం కోల్పోతున్నారు. అయితే చుట్టుపక్కల వాళ్లు కాస్త అలర్ట్ గా ఉంటే ప్రాణాలు కాపాడచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయాన్ని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజం చేసి చూపించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. మొదట నోట్లో నుంచి నురగ రావడం, అచేతనంగా పడిపోవడంతో మూర్ఛ వచ్చిందని భావించారు. కానీ, అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ మాత్రం గుండెపోటు వచ్చినట్లు భావించాడు. వెంటనే బాలరాజు గుండెల మీద రెండు చేతులతో బలంగా ఒత్తిడి తీసుకురావడం చేశాడు. కొద్దిసేపు అలా సీపీఆర్ చేసిన తర్వాత బాలరాజులో చలనం వచ్చింది. తర్వాత మరికాసేపు సీపీఆర్ చేయగా.. బాలరాజు స్పృహలోకి వచ్చాడు. రాజశేఖర్ చూపించిన సమయస్ఫూర్తి వల్లే బాలరాజు ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశారు. రాజశేఖర్ పై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా హైదరాబాద్ లో విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించాడు. సాధారణంగా ఫిట్ గా ఉండేందుకు అంతా జిమ్ చేస్తారు. కానిస్టేబుల్ అంటే ఆ మాత్రం ఫిట్ గా ఉండాల్సిందే మరి. జిమ్ లో పుషప్స్ చేశాడు. ఆ తర్వాత బాడీని స్ట్రెక్చ్ చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చినట్లు కనిపించింది. సెకన్ల వ్యవధిలోనే విశాల్ కుప్పకూలాడు. అక్కడున్న వాళ్లు విశాల్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే విశాల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్
రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు. pic.twitter.com/vDH3zdd6gm
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 24, 2023
— Hardin (@hardintessa143) February 24, 2023