భైరి నరేష్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. అయ్యప్ప స్వామి పుట్టుకను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భైరి నరేష్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతుండటంతో భైరి నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి 20 రోజుల రిమాండ్ విధించింది. అతని రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.
ఓయూ విద్యార్థి, భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్ రిమాండ్ రిపోర్టులోని అంశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు భైరి నరేష్ ఒప్పుకున్నట్లుు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్టులో భైరి నరేష్ నేరం అంగీకరించినట్లు తెలిపారు. తాను హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు భైరి నరేష్ అంగీకరించినట్లు చెబుతున్నారు. కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడని రిమాండ్ రిపోర్టులో ఉంది.
మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షులు నలుగురు భైరి నరేష్ ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. భైరి నరేష్ ని కావాలనే ఆహ్వానించినట్లు హనుమంతు అనే వ్యక్తి స్టేట్మెంట్ గా పోలీసులు రికార్డు చేశారు. భైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్లు బాగా వినిపిస్తున్నాయి. అతడిని కఠినంగా శిక్షించాలంటూ అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేస్తున్నారు.
డిసెంబర్ 19న కొడంగల్ లో జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని భైరి నరేష్ అయ్యప్ప స్వామి జననంపై వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప స్వామి పుట్టుకను కించపరుస్తూ భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. భైరి నరేష్ పై వేరే రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం అతనిపై 200 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గంతలో కూడా దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఘటనలో భైరి నరేష్ పై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.