మందు బాబులం మేము మందుబాబులం..మందు కొడితే మాకు మేమే మహా రాజులం అంటూ గబ్బర్ సింగ్ లో కోటా శ్రీనివాసరావు లెక్క పాడుకున్నారు. ఇంటికి పోయేందుకు బండ్లపై రోడ్డు బాట పట్టారు. వీళ్ల కోసమే అన్నట్లు గబ్బర్ సింగ్ రూపంలో ఉన్న పోలీసోళ్లు.. వారిని ఆపి చెక్ చేశారు. ఇంకే ముందీ మందు బాబులు అడ్డంగా దొరికిపోయారు. తాగి బండినపినందుకు పట్టుకోవడమే కాదూ.. వీరికి విధించిన శిక్షతో బాబోయ్ ఇక భవిష్యత్తులో మందు జోలికే పోకూడదు రా అనుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. మంచిర్యాల జిల్లాలో ఇటీవల పోలీసులు రాత్రి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో 13 మంది అడ్డంగా దొరికిపోయారు. ఇంకేముందీ వారి బండ్లు సీజ్ చేసి, పొద్దునే కోర్టులో హాజరు పర్చారు. తాగి బండి నడపొద్దని ఎంత చెప్తున్నా వినిపించుకోకపోవట్లేదని అనుకున్నారేమో జడ్జి.. మంచిర్యాల మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని ఆదేశించారు. అదీ కూడా రెండు రోజుల పాటు చేయాలని వింత పనిష్మంట్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం డ్యూటీ ఎక్కితే, మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సిందేనని ఆదేశించారు.
ఇంకేమందీ జడ్జి తీర్పుకు కట్టుబడి, వారంతా దవాఖానాలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. వీరందరితో దగ్గర నుండి పనిచేయించారు పోలీసులు. ఆసుప్రతి వద్ద పేరుకుపోయిన పిచ్చి మొక్కలను, చెత్తను వారితో ఏరించడం, మట్టి సాఫీ వంటి పనులు చేయించారు. దీంతో ఈ శిక్ష పడిన వాళ్లంతా, దీని కన్నా మందు మానేయాలిరా బాబూ అనుకుంటున్నారట. నిజంగా బుద్దొస్తే.. వారి కుటుంబాలు కూడా ఫుల్ ఖుషీ అయిపోతాయిలే. మందు బాబులకు కోర్టు వేసిన ఈ శిక్ష ఎలా ఉందో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.