JWST: మానవాళిని మూఢనమ్మకాల నుండి ముందుకు తీసుకెళ్ళేదే సైన్స్. అలాంటిది ఈ టెక్నాలజీ మాత్రం మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. అది కూడా కోట్ల సంవత్సరాల వెనక్కి. మరీ అంత వెనక్కి తీసుకెళ్తే మూఢ నమ్మకం అనుకుంటారేమో.. అని అనుకోకండి. ఈ టెక్నాలజీతో వెనక్కి వెళ్లడం కూడా ముందుకు వెళ్లడం కిందే లెక్క. ఈ సైన్స్ ఏంటి? వెనక్కి తీసుకెళ్లడం ఏంటి? ఆ టెక్నాలజీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయాల్సిందే.
సైన్స్ పుట్టిన మొట్టమొదటి క్షణాల్లో విశ్వం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఓ టెలిస్కోప్ ని కనిపెట్టారు. మరి విశ్వం పుట్టిన సమయంలో దాని రూపురేఖలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఒక సూపర్ టెలిస్కోప్ కనిపెట్టకపోతే ఎలా?.. అని అనుకుందో ఏమో.. మొత్తానికి నాసా ఒక అద్భుతమైన పరికరాన్ని అయితే కనిపెట్టింది.
దాని పేరు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇప్పటివరకూ ప్రస్తుతం విశ్వం ఎలా ఉందో అనేది మనకి కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ వచ్చిన నాసా, ఇక నుండి బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఎలా ఉందో చూపించబోతోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే చూపించేసింది. ఇక ముందు సినిమా చూపిస్తామని నాసా చెబుతోంది.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొదటి ఫోటో:
విశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు, కాలంలో వెనక్కి వెళ్లి చూసేందుకు తయారు చేసిన సూపర్ టెలిస్కోప్ ‘జేమ్స్ వెబ్’ తీసిన మొదటి ఫొటోను నాసా విడుదల చేసింది. ఆ ఫోటోలో కనిపిస్తున్నది గెలాక్సీల సమూహం. ఈ సమూహం ఎస్ఎంఏసీఎస్ 0723 అనే పేరున్న వోలాన్స్ దక్షిణార్థగోళంలో ఉంది. ఈ గెలాక్సీల సమూహం భూమికి 460 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
వెబ్ టెలిస్కోప్ లో 6.5 మీటర్ల వెడల్పున్న గోల్డెన్ మిర్రర్లు, సూపర్ సెన్సిటివ్ ఇన్‌ఫ్రారెడ్ పరికరాలను అమర్చారు. వీటి సహాయంతో బిగ్‌బ్యాంగ్ ఏర్పడిన 600 మిలియన్ సంవత్సరాల తర్వాత ఉనికిలో ఉన్న గెలాక్సీల వక్రీకరణ రూపాన్ని (రెడ్ ఆర్క్ ను) ఇది గుర్తించగలుగుతుంది.
కోట్ల సంవత్సరాల వెనక్కి:
కాంతి.. సెకనుకు 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఆ చిన్న మచ్చల్లోని ఒకదానిపై మీరు చూస్తోన్న కాంతి, 13 బిలియన్ సంవత్సరాలకు పైగా వేగంతో ప్రయాణిస్తోంది. ఈ విధంగా మనం మరింత వెనక్కి వెళ్తున్నాం. ఈ టెలిస్కోప్ పదమూడున్నర బిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్తోంది. ఈ విశ్వం వయస్సు 13.8 బిలియన్ సంవత్సరాలు అని మనకు తెలుసు. కాబట్టి, మనం దాదాపు విశ్వం ఆరంభానికి వెళ్తున్నామని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యూఏఎస్‌పీ-96బి అనే ఒక పెద్ద గ్రహం యొక్క వాతావరణాన్ని ఈ టెలిస్కోప్ విశ్లేషించింది. ఆ గ్రహం పరిస్థితుల గురించి వెబ్ సమాచారం అందించనుంది. వెబ్ టెలిస్కోప్, తనకు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి దీని కార్యకలాపాలు పదేళ్ల పాటు కొనసాగుతాయని భావించినప్పటికీ.. ఇందులో 20 ఏళ్ళు నిరంతరంగా పని చేయడానికి తగినంత ఇంధన సామర్ధ్యం ఉందని నాసా వెల్లడించింది.
విశ్వం గుట్టు ఛేదిస్తాం:
విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను రూపొందించాయి. దాదాపు రూ. 75 వేల కోట్ల వ్యయంతో గత ఏడాది డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎరియాన్-5 రాకెట్ దీన్ని ఆకాశం అంచులకు తీసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ప్రవేశపెట్టారు.
ఈ అధునాతన పరికరంతో విశ్వం యొక్క పుట్టుక, రహస్యాన్ని ఛేదించనున్నారు. దీన్ని ప్రఖ్యాత హబుల్ స్పేస్ టెలిస్కోప్ కు వారసుడిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి చిత్రాన్ని తీయడానికి.. హబుల్ స్పేస్ టెలిస్కోప్ వారాల సమయం తీసుకునేది. కానీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కేవలం 12.5 గంటల్లోనే ఈ చిత్రాన్ని తీసింది.
ఎవరూ వెళ్ళని ప్రదేశాలకు వెళ్తాం:
వైట్ హౌస్ బ్రీఫింగ్ లో భాగంగా ఈ టెలిస్కోప్ తీసిన కలర్ ఫొటోను అధ్యక్షుడు జో బైడెన్ వీక్షించారు. ఇప్పటి వరకూ విశ్వాన్ని అత్యంత లోతుగా, వివరణాత్మకంగా చూపించిన పరారుణ దృశ్యంగా ఈ ఫొటోను వర్ణించారు. గెలాక్సీల నుంచి ఈ దృశ్యం మనకు చేరడానికి బిలియన్ సంవత్సరాలు పట్టిందని చెబుతున్నారు. ఇంతకు ముందు వరకూ ఎవరూ చూడని అవకాశాలను మనం చూడొచ్చు. ఇప్పటివరకూ ఎవరూ వెళ్లని ప్రదేశాలకు మనం వెళ్లవచ్చునని బైడెన్ వ్యాఖ్యానించారు.
సూపర్ టెలిస్కోప్ లక్ష్యం:
సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఇతర గ్రహాలను అధ్యయనం చేసేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఆకాశాన్ని అన్ని విధాలుగా ఇది పరీక్షిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి, 1350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో తొలిసారిగా మిణుకుమన్న నక్షత్రాలను ఫొటో తీయడం. రెండోది, ఇతర గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయో లేదో గుర్తించడం. ఇప్పటికే ఈ టెలిస్కోప్ తీసిన చిత్రాలను నాసా మంగళవారం ప్రదర్శించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 12:30 గంటలకు బీబీసీ టీవీలో “సూపర్ టెలిస్కోప్: మిషన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్” పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. మరి, ఈ జేమ్స్ వెబ్ స్పేస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: లెైవ్ లో కుర్రాడి చెంప పగలగొట్టిన రిపోర్టర్!