మనిషి యంత్రంలా పని చేయడానికి ఇష్టపడడు. అందుకే యంత్రాలకు అంత ప్రాధాన్యత. యంత్రాలు వచ్చాక శారీరక పనులు చేసే ఉద్యోగులు బాగా తగ్గిపోయారు. పది మంది మనుషులు చేసే పనులు ఒక యంత్రం చేసేస్తుంది. దీనికి మనిషి పెట్టుకున్న పేరు టెక్నాలజీ. టెక్నాలజీ టెక్నాలజీ ఏం చేస్తావు అంటే మనుషుల కడుపు కొడతాను, వారి ఉద్యోగాలు పోయేలా చేస్తాను, వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీద పడేస్తాను అని అన్నదట. కొన్ని టెక్నాలజీలు పెరుగుతున్నాయంటే దానర్థం మనిషి అభివృద్ధి చెందుతున్నాడని కాదు, టెక్నాలజీ మాత్రమే అభివృద్ధి చెందుతుందని. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసి మనిషిని రోడ్డున పడేలా చేస్తుంది టెక్నాలజీ. తాజాగా చాట్ జీపీటీ వల్ల కూడా అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ప్లాట్ ఫామ్ వల్ల ఎన్నో ఉద్యోగాలకు గండి పడనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో పలు ఉద్యోగుల స్థానాలను ఏఐ చాట్ బాట్ లు ఆక్రమించాయి. భారత్ లో కూడా ఈ పరంపర కొనసాగుతుందని.. దీని వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని గార్ట్ నర్ అనే మార్కెట్ పరిశోధన సంస్థ వెల్లడించింది. ఈ చాట్ జీపీటీ వల్ల కొన్ని రకాల ఉద్యోగాలకు మనుషుల అవసరం ఉండదని.. ఆ ఉద్యోగులు వేరే జాబ్ చూసుకోక తప్పదని నివేదికలు చెబుతున్నాయి. రెజ్యూమ్ బిల్డర్ సంస్థ ఇటీవల ఆయా రంగాలకు చెందిన వ్యాపార వ్యవహారాల్లో రాణిస్తున్న వెయ్యి మంది బిజినెస్ లీడర్స్ తో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఉద్యోగుల స్థానాన్ని చాట్ బాట్స్ తో భర్తీ చేసేందుకు అమెరికాలో సగానికి పైగా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది.
చాట్ జీపీటీ వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని రంగాల్లో ఉద్యోగాలు కోల్పోతారేమో అన్న భయం వెంటాడుతోంది. కానీ చాట్ జీపీటీని తయారుచేసిన ఓపెన్ ఏఐ సంస్థ మాత్రం.. చాట్ జీపీటీ ఉద్యోగుల స్థానాలను ఆక్రమించబోదని.. ఉద్యోగులకు సహాయం చేసేందుకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో చాట్ జీపీటీకి సంబంధించి అప్ డేటెడ్ వెర్షన్ జీపీటీ-4ను విడుదల చేసింది. ప్రస్తుత చాట్ జీపీటీ-3.5 కన్నా జీపీటీ-4 మరింత వేగంగా, ఖచ్చితత్వంతో సమాధానాలు చెబుతుండడంతో దాని పనితీరుపై వినియోగదారుల్లో ఆసక్తి ఎక్కువైంది. అందుకే ఈ అప్ డేటెడ్ వెర్షన్ వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందేమో అన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో ట్విట్టర్ యూజర్ ప్రశాంత్ రంగస్వామి చాట్ జీపీటీ-4ని ఈ ప్రశ్న అడిగారు. అయితే చాట్ జీపీటీ-4 20 రకాల ఉద్యోగాల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా చాట్ జీపీటీ-4 పని చేస్తుందని సమాధానం ఇచ్చింది.
డేటా ఎంట్రీ క్లర్క్, ప్రూఫ్ రీడర్, కాపీ రైటర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, పారా లీగల్, బుక్ కీపర్, ట్రాన్స్ లేటర్, అపాయింట్మెంట్ ట్రాన్స్క్రిప్షనిస్ట్, షెడ్యూలర్, టెలీ మార్కెటర్, వర్చువల్ అసిస్టెంట్, న్యూస్ రిపోర్టర్, ట్రావెల్ ఏజెంట్, ఈమెయిల్ మార్కెటర్, ట్యూటర్ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, కంటెంట్ మోడరేటర్, రిక్రూటర్ ఉద్యోగాలను చాట్ జీపీటీ-4 భర్తీ చేస్తుందని వెల్లడించింది.
అయితే చాట్ జీపీటీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం లేదని, చాట్ జీపీటీ ఏఐలు ఉద్యోగులకు సహోద్యోగులుగా మాత్రమే పని చేస్తాయని టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాట్ జేపీటీ టెక్నాలజీ అనేది మనుషులకు సపోర్ట్ గా ఉంటుందే తప్ప వారి ఉద్యోగాలను భర్తీ చేయదని టెక్ దిగ్గజ సంస్థలు చెబుతున్నాయి. అయితే అమెరికాలో సగానికి పైగా కంపెనీలు ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తూ చాట్ జీపీటీ సేవలను పొందాలని చూస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. చాట్ జీపీటీ-4 కూడా 20 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని సమాధానం ఇచ్చింది.
ఒకవైపు టెక్ దిగ్గజాలు కూడా భయపడాల్సిన పని లేదని అంటున్నారు. మరోవైపు ఈ టెక్నాలజీ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విషయంలో ఎవరిని నమ్మాలి? ఉద్యోగులకు భరోసా ఇచ్చేది ఎవరు? అసలు వారి ఉద్యోగాలకు గ్యారంటీ అనేది ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి చాట్ జేపీటీ-4 వెర్షన్ వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందా? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
20 jobs that Chat GPT 4 will replace in the near future . Predicted by the AI itself . pic.twitter.com/wleOgij9E5
— Prashanth Rangaswamy (@itisprashanth) March 16, 2023