భారత సైన్యం ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ తమ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లు అంటూ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఆర్మీ అమ్ములపొదిలో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు మరో ఆవిష్కరణ సైన్యానికి అందనుంది.
ఇండియన్ ఆర్మీ బలం, సామర్థ్యం, వాళ్లు వాడే సాంకేతికత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించేలా భారత సైన్యం ఎప్పటికప్పుడు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ఎంతో అడ్వాన్స్ డ్ టెక్నాలజీని వినియోగిస్తూ తోక జాడిచ్చే శత్రువులకు, ఉగ్రమూకకు సవాలు విసురుతోంది. ఇప్పటికే డ్రోన్లు, ఫైటర్ జెట్లు అంటూ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆర్మీ అమ్ములపొదిలోకి ఇంకో అద్భుతమైన వస్తువు ఒకటి వచ్చి చేరనుంది. దీనివల్ల కచ్చితంగా ఆర్మీ సామర్థ్యం పెరుగుతుందనే చెప్పాలి. అతి త్వరలోనే జెట్ ప్యాక్ సూట్ ఆర్మీకి అందనుందని చెబుతున్నారు. ఇదే జరిగితే లక్ష్యాలను చేరడం మరింత సులువని తెలియజేస్తున్నారు.
భారత సైనిక దళానికి జెట్ ప్యాక్ సూట్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఎగురుతూ వెళ్లి లక్ష్యాలను చేరేందుకు వీలవుతుంది. అలాగే హిట్ అండ్ రన్, కొండలు ఎక్కడం, అగ్ని ప్రమాదాల సమయంలో సహాయ చర్యలు అందించడం, ఉగ్రమూక ఆట కట్టించడం వంటి వాటికి ఈ జెట్ ప్యాక్ సూట్లు బాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూట్ ని బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ రూపొందించింది. దీనిని బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం ఈ జెట్ ప్యాక్ సూట్ దేశానికి చెందిన సైనిక సంస్థలనే కాదు.. విదేశీ సైనిక సంస్థలను సైతం ఆకర్షిస్తోంది.
దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. జవాన్ పారాచ్యూట్ లేకుండానే దీని సాయంతో పక్షిలాగా గాల్లోకి ఎగరచ్చు. సుదూర ప్రాంతాలను ఎగురుతూ చేరుకోవచ్చు. ఇందులో చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన టర్బో ఇంజిన్ ఉంది. ఎయిర్ ఇన్ లెట్ కాంపాక్ట్ ఫ్లయింగ్ మెషిన్ విధానంతో ఎగిరేందుకు వీలుగా వ్యవస్థలు ఉన్నాయి. ఈ జెట్ ప్యాక్ లో 30 లీటర్ల సామర్థ్యంతో డీజిల్ ట్యాంక్ ను అమర్చారు. దీని మొత్తం బరువు 80 కిలోల వరకు ఉంటుంది. ఇది 50 కిలోమీటర్ల వేగంతో 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. టర్బో జెట్ ల మాదిరిగా పనిచేసేలా ఈ జెట్ ప్యాక్ లను తయారు చేశారు. ఇప్పటికే 48 జెట్ ప్యాక్ సూట్లను పరీక్షించేందుకు రక్షణ శాఖ ప్రతిపాదనల విభాగానికి అందజేసింది. వీటిని పరీక్షించిన తర్వాత వాళ్లు దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించడం, సేవలకు వనియోగించుకునే నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు.
Jetpack suit, displayed at #AeroIndiaShow2023, manufactured by a #Bengaluru-based startup will enable soldiers to fly like birds and carry out missions is in the reckoning for the contract by the armed forces, According to sources. pic.twitter.com/EdgXxPZChB
— IANS (@ians_india) February 15, 2023