ఎండలు పెరుగుతుండటంతో ఇప్పుడిప్పుడే ఏసీలకు పని చెప్పడం ప్రారంభించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏడాది మొత్తం ఏసీ వాడేవారు చాలా తక్కువగా ఉంటారు. వేసవికి మాత్రమే ఏసీలను వాడటం ప్రారంభిస్తారు. అయితే ఏడాదికి ఒకసారి వాటిని ఆన్ చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
మండే ఎండలతో వేసవి రానే వచ్చింది. వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఉదయం పూట ఎండ వేడి, ఊదురు గాలులు కూడా మొదలయ్యాయి. రాత్రిపూట కూడా వాతావరణం దాదాపుగా వేడిగా ఉంటోంది. ఇప్పటికే చాలా మంది తమ ఇంట్లో ఏసీలకు పని చెప్పడం ప్రారంభించారు. అయితే దాదాపు ఏడాది పాటు ఎయిర్ కండిషనర్ ఆఫ్ లో ఉంచి ఇప్పుడు ఆన్ చేస్తే సక్రమంగా పనిచేస్తుందని గ్యారెంటీ ఇవ్వలేరు. అలా ఆన్ చేసినా కూడా కూలింగ్ సరిగ్గా రాదు. ఏంటి మీ ఏసీ కూడా కూలింగ్ రావడం లేదా? ఏసీ ఆన్ చేసినా కూడా రూమ్ వేడిగానే ఉంటోందా? ఒకవేళ మీ ఏసీ కూలింగ్ రాకపోతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
ఏసీలో కండన్సర్ కాయిల్ అనేది బయట ఉండే యూనిట్ లో ఉంటుంది. అది ఎప్పుడూ బయటే ఉండటం వల్ల గాలికి దుమ్ము, ధూళి పేరుకుంటూ ఉంటుంది. కండన్సర్ కాయిల్స్ అలా దుమ్ముతో నిండిపోవడం వల్ల రూమ్ కూలింగ్ అవ్వడం కాస్త ఆలస్యం కావడం లేదా అస్సలు కూలింగ్ కాకపోవడం జరగచ్చు. పైగా బయట ఉండే యూనిట్ పై పావురాలు గూళ్లు కడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒకసారి కండన్సర్ కాయిల్స్ చెక్ చేయించడం మంచిది.
ఇంట్లో ఏసీ కూలింగ్ కాకపోతుంటే.. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఎయిర్ ఫిల్టర్స్. అవును ఎయిర్ ఫిల్టర్స్ ఎక్కువగా డస్ట్ తో నిండి ఉంటాయి. అవి తరచూ క్లీన్ చేసుకోవాలి. గాలిలో ఉండే దుమ్ము- ధూళిని ఈ ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేస్తుంటాయి. అవి డస్ట్ నిండిపోతే కచ్చితంగా ఏసీ కూలింగ్ రాదు. కాబట్టి ఎయిర్ ఫిల్టర్స్ ని క్లీన్ చేసుకోవడం మంచిది.
ప్రస్తుతం దాదాపు క్వాలిటీ విద్యుత్ లభిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. లేదా కంటిన్యూస్ గా ఏవర్ లోడ్ పడటం వల్ల కూడా ఏసీ మోటర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఏసీ మోటర్ పాడవటం వల్ల కూడా మీకు ఇబ్బంది వచ్చి ఉండచ్చు. మోటార్ చెకింగ్ అనేది కూడా తప్పకుండా చేసుకోవాలి.
ఏసీలో కంప్రెసర్ అనేది చాలా ముఖ్యమైంది. కొన్నిసార్లు కంప్రెసర్ కూడా పాడవుతూ ఉంటుంది. కంప్రెసర్ వర్క్ చేయకోపోయినా కూడా మీ ఏసీ సరిగ్గా కూలింగ్ కాదు. ఏవాపరేటర్- కండన్సర్ మధ్య సర్క్యులేషన్ ను ఈ కంప్రెసర్ కంట్రోల్ చేస్తుంటుంది. అందుకే కంప్రెసర్ ని కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. కంప్రెసర్ సరిగ్గా ఉంటేనే ఏసీ కూలింగ్ బాగా వస్తుంది.
ప్రతి ఏసీ రిమోట్ లో మీకు రూమ్ టెంపరేచర్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. మీరు ఆటో కూలింగ్ ఆన్ చేస్తే ఆ స్టాటిక్స్ ని బట్టే ఏసీ కూలింగ్ అవుతుంది. మీ రూమ్ టెంపరేచర్ ఆ రిమోట్ లో ఉన్న టెంపరేచర్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. అలాంటి సమయంలోనే మీ ఏసీ రూమ్ ని చల్ల బరుస్తుంది. అలాగే ఏడాదికి ఒకసారి వేసవి ప్రారంభానికి ముందే మీ ఏసీని సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. అలా చేయడం వల్ల మళ్లీ వేసవి వరకు మీ ఏసీ చక్కగా పనిచేస్తుంది.