వెస్టిండీస్-భారత్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించాడు. ఇక టీమిండియాలో అడుగుపెట్టి అరంగ్రేట మ్యాచులోనే ఊహలకందని ఇన్నింగ్స్ ఆడుతూ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇదంతా చెబుతుంది టీమిండియా భవిష్యత్తు స్టార్ ఓపెనర్ గా కితాబులందుకుంటున్న యశస్వి జైస్వాల్ గురించి. దేశవాళీ క్రికెట్ లో విపరీతమైన కాంపీటీషన్ ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ లో చోటు దక్కించుకోవడమే చాలా కష్టమైనా విషయం. అలాంటిది జైస్వాల్ ఇండియన్ స్క్వాడ్ లో సెలక్ట్ అవ్వడమే కాదు తుది జట్టులో ఆడే అవకాశం వచ్చింది. అయితే వచ్చిన ఈ అవకాశాన్ని ఈ ముంబై కుర్రాడు రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగాడు.
వెస్టిండీస్-భారత్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. 350 బంతుల్లో 14 ఫోర్లతో 143 పరుగులు చేసి తన తొలి ఇన్నింగ్స్ ని మెమరబుల్ గా మార్చుకున్నాడు. జైస్వాల్ ఇన్నింగ ఆధ్యంతం ఎలాంటి అనవసర షాట్లకు పోకుండా ఎంతో పరిణితి చెందిన ఆటగాడిలా ఆడాడు. ఈ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. డెబ్యూ మ్యాచులోనే సెంచరీ బాదిన 17 వ ఆటగాడిగా నిలిచాడు. శిఖర్ ధావన్, పృద్వి షా తర్వాత తొలి మ్యాచులోనే సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు. ఇక విదేశాల్లో అరంగ్రేటం మ్యాచులో సెంచరీ బాదిన 5 వ క్రికెటర్ గా నిలిచాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచులో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన నాలుగో భారత్ ప్లేయర్ గా జైస్వాల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ జాబితాలో అబ్బాస్ అలీబేగ్, పృథ్విషా, గుండప్ప విశ్వనాధ్ లు ఉన్నారు. 91 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరఫున అరంగేట్రం టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు తన పేరున లిఖించుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ తో పాటు మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ(103) కూడా సెంచరీతో కదం తొక్కాడు. ఈ ముంబై జోడీ తొలి వికెట్ కి ఏకంగా 229 పరుగులు జోడించడం విశేషం. ఇక వన్ డౌన్ లో వచ్చిన శుభమన్ గిల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దేంతో స్వల్ప వ్యవధిలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అయితే జైస్వాల్ కి జోడీగా వచ్చిన విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. ప్రస్తుతం క్రీజ్ లో జైస్వాల్ (143) తో పాటు విరాట్ కోహ్లీ (36) ఉన్నాడు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు ఓటమి నుండి తప్పించుకోవాలంటే అద్భుతమే జరగాలి. మొత్తానికి జైస్వాల్ అరంగ్రేటా మ్యాచులోనే ఇన్ని రికార్డులు బ్రేక్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.