భారత యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. గతేడాది దేశవాళీ క్రికెట్ లో చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్న ఇతడు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ మధ్యే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ఎంపికైన అతడు.. రెండు మ్యాచుల్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇది పూర్తయిన వెంటనే.. రంజీల్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ఆడేస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో ఆడిన తొలి రంజీ మ్యాచ్ లోనే ఉనద్కత్ అదిరిపోయే బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది. అలానే రంజీల్లో ఉనద్కత్ సరికొత్త రికార్డు కూడా సెట్ చేసేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజ్ కోట్ వేదికగా సౌరాష్ట్ర, దిల్లీ మధ్య మంగళవారం మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన ఉనద్కత్.. మూడు బంతుల్లో వరసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ అందుకున్నాడు. తొలి రెండు బంతులకు పరుగులివ్వని ఉనద్కత్.. మూడో బంతికి ధృవ్ షోరేను, నాలుగో బంతికి వైభవ్ రావల్, ఐదో బంతికి కెప్టెన్ యష్ ధుల్ ని పెవిలియన్ కు పంపించాడు. ఇతడి బంతుల దెబ్బకు ఖాతా తెరవకుండానే దిల్లీ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. తన రెండో ఓవర్ లో ఉనద్కత్.. సిద్ధు, లలిత్ యాదవ్ లను ఔట్ చేశాడు.
ఇక రంజీ ట్రోఫీలో రెండు ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఉనద్కత్ రికార్డ్ సృష్టించాడు. జయదేవ్ ధాటికి దిల్లీ.. 10 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఇక ఈ మ్యాచులో తొలి సెషన్ పూర్తయ్యేసరికి ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఉనద్కత్.. 20 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇక ఇదే మ్యాచులో దిల్లీ టాపార్డర్ బ్యాటర్లు నలుగురు డకౌట్ అయ్యారు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో ఇర్ఫాన్ పఠాన్.. తొలి ఓవర్ లో హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. పాకిస్థాన్ తో మ్యాచులో ఈ రికార్డు నమోదు చేశాడు. మరి ఉనద్కత్.. ఫస్ట్ ఓవర్ తొలి మూడు బంతుల్ని హ్యాట్రిక్ గా మలచడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.