ఇంగ్లండ్ గెలుపు మంత్రమైన బజ్‌బాల్ ఫెయిలైంది. ఆస్ట్రేలియా టీమ్ పోరాటపటిమ ముందు స్టోక్స్ సేన వ్యూహాలు ఫలించలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ ఓటమికి కెప్టెన్ స్టోక్స్ ప్రధాన కారణంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ చెబుతున్నారు.
ప్రపంచ క్రికెట్లో ఎన్నో గొప్ప మ్యాచ్‌లను చూసుంటారు. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో జట్లు తలపడే తీరు, గెలుపు కోసం చివరి దాకా చేసే పోరాటాలు చూడటానికి రెండు కళ్లు చాలు. అలాంటి గొప్ప మ్యాచ్‌లు ఒకే సిరీస్‌లో చూడాలంటే అది కేవలం యాషెస్తోనే సాధ్యం. బూడిద కప్ కోసం జరిగే ఈ సిరీస్‌లో నెగ్గేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ప్లేయర్లు ప్రాణం పెట్టేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకోరు. అందుకే చాలా మటుకు యాషెస్ మ్యాచ్‌లు ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు వెళ్తాయి. ఒత్తిడిని తట్టుకున్న జట్టే విజేతగా నిలుస్తుంది. హైటెన్షన్ మ్యాచ్‌లు కాబట్టే యాషెస్ సిరీస్‌కు అంత ఆదరణ ఉంటుంది. ఈసారి యాషెస్ సిరీస్‌కు ఘనమైన ఆరంభం దక్కింది. ఎప్పటిలాగే మ్యాచ్ చివరి రోజు, లాస్ట్ సెషన్లో ఫలితం తేలింది. ఉత్కంఠత తీవ్రస్థాయికి చేరుకున్న మ్యాచ్‌లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఓపెనర్ ఖవాజా (65), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44)లు కంగారూ టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లీష్ బౌలర్లను కాచుకొని లయన్ (16) అండగా కమిన్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసీస్ సారథిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అదే టైమ్‌లో ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై విమర్శలు వస్తున్నాయి. బజ్‌బాల్ పేరుతో ఈ మ్యాచ్ తొలిరోజే సాహసం చేశాడు స్టోక్స్. ఫస్ట్ డే పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 రన్స్ దగ్గర డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ టీమ్‌కు ధీటుగా బదులిచ్చింది ఆసీస్. ఆ జట్టు 386 రన్స్‌కు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఒకవేళ స్టోక్స్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయకుండా ఉంటే.. ఇంగ్లండ్‌కు మరో 30 నుంచి 40 రన్స్ లీడ్ దొరికి ఉండేది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు ఛేజింగ్ మరింత కష్టమయ్యేది. స్టోక్స్ చేసిన ఆ ఒక్క తప్పే ఇంగ్లండ్ ఓటమికి కారణమైందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ప్రతిసారి బజ్‌బాల్ వ్యూహం పనికిరాదని స్టోక్స్ అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి.. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను ఇంగ్లీష్ టీమ్ కొనసాగిస్తుందో లేదో చూడాలి.