భారత మహిళల క్రికెట్ జట్టులో మరో తెలుగమ్మాయి చోటు దక్కించుకుంది. బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది.
గల్లీ క్రికెట్ ఆడే ఎందరో ప్లేయర్లు కనే కలను.. అనంతపురం అమ్మాయి నిజం చేసుకుంది. ఎప్పటికైనా అత్యున్నత స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని దృఢ నిశ్చయంతో ప్రయత్నించిన ఆ అమ్మాయి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. బౌలర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ పడగొట్టలేకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని చూరగొన్నది. ఆ అమ్మాయే బారెడ్డి అనూష. 2003 జూన్ 6న అనంతపురంలో పుట్టిన అనూష.. చిన్నప్పటి నుంచే క్రికెట్ వైపు ఆసక్తి చూపింది. సంప్రదాయ స్పిన్‌కు కాస్త భిన్నంగా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ఈ అమ్మాయి.. మొదట ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో రాణించి.. జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఆంధ్ర జట్టులో తరఫున మంచి ప్రదర్శనలు చేస్తుండటంతో బంగ్లాదేశ్ తో టూర్‌కు ఈ అనూషను సెలెక్ట్ చేశారు. తొలి మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అనూష.. వికెట్ పడగొట్టకపోయినా 24 పరుగులే ఇచ్చి ఆకట్టుకుంది.
అటు స్పిన్నర్లు, ఇటు బ్యాటర్లు రాణించడంతో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన పోరులో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మీర్‌పూర్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. షొర్నా అక్తర్ (28 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. శథి రాణి (22), శోభన (23) రాణించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, మిన్ను మని, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 118 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మందన (38; 5 ఫోర్లు) ధాటిగా ఆడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే మ్యాచ ద్వారా అరంగేంట్రం చేసిన మరో భారత అమ్మాయి మిన్ను మని ఓ వికెట్ పడగొట్టింది.