మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. టీమిండియాలో ఇప్పుడు ఇతనో సంచలనం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత.. భారీ క్రేజ్ ఉన్న క్రికెటర్. కాస్త లేటుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన 360 ఆటతో అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. బ్యాటింగ్‌కు దిగితే.. పిచ్ ఎలా ఉన్నా, ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా.. దంచుడే పనిగా పెట్టుకుంటాడు. ఐపీఎల్‌లో కేకేఆర్, ముంబై ఇండియన్స్‌కు ఆడి మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య.. టీమిండియాలోకి వచ్చి సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం అతనే టీమిండియా కీ ప్లేయర్. నాలుగో స్థానాన్ని ఆక్రమించుకున్న వారియర్. ప్రపంచంలో ఏ బౌలర్ దగ్గర కూడా సూర్యను అవుట్ చేసే డెలవరీ లేదు. వాళ్ల అదృష్టం కొద్ది ఏదో షాట్ మిస్ టైమ్ సూర్య అవుట్ అవ్వడం తప్పితే.. ఫలానా బాల్ వేస్తే సూర్య ఇబ్బంది పడి అవుట్ అవుతాడనే సవాలే లేదు. ఏం బాల్ వేసినా.. ఎవరి ఊహకు కూడా అందని షాట్ ఆడి అదరగొట్టేస్తాడు.
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లోనూ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. మూడు హాఫ్ సెంచరీలతో టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 239 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కానీ.. సూర్యుకు టీమిండియాలో అవకాశం మాత్రం లేటుగా వచ్చిందనేది కాదనలేని వాస్తవం. దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో టన్నులకొద్ది పరుగులు చేస్తున్నా.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కేది కాదు. ఆ సమయంలో సూర్య తీవ్ర నిరాశకు గురవుతుంటే.. ఒక వ్యక్తి మాత్రం అతన్ని అనునిత్యం ఉత్సాహపరుస్తూ.. మంచి రోజులు వస్తాయని ధైర్యం చెబుతూ.. తన వెన్నంటే నిలిచేంది. కష్టాల్లో తోడుంటూ, కచ్చితం ఒక రోజు దేశం గర్వపడేలా చేస్తాడని సూర్యని బలంగా నమ్మిన వ్యక్తి అతని భార్య దేవిషా శెట్టి.
సూర్యకుమార్ యాదవ్ సక్సెస్ కాకముందు నుంచే తనకు తోడుగా నిలిచింది. సూర్యను ప్రతిక్షణం తన లక్ష్యంవైపు సాగేలా చూసింది. అందుకే సూర్యకు తన భార్యంటే అంతులేని ప్రేమ, అభిమానం. ఆ ప్రేమను గురువారం మాటల్లో బయటపెట్టాడు సూర్య. నవంబర్ 17 దేవిషా పుట్టిన రోజు సందర్భంగా తన భార్యంటే తనకు ఎంత ప్రేమ, గౌరవమో వెల్లడించాడు. ‘నా అందమైన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నన్ను అనునిత్యం ఫోకస్‌గా, మోటివేటడ్‌గా, గ్రౌండెడ్‌గా ఉంచింది నువ్వే. నిజంగా నువ్వు లేకుంటే నేను ఏం చేసేవాడినో తెలియడం లేదు. నాకు ఇంతటి అమూల్యమైన ఆశీర్వాదం దక్కడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను.’ అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం సూర్య పోస్టు వైరల్‌గా మారింది. కాగా సూర్య ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్ అనంతరం దొరికిన ఖాళీ టైమ్‌ను భార్యతో కలిసి కివీస్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు.