క్రికెట్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అనవాయితి.. అలాగే ఫీల్డ్ అంపైర్లతో కూడా కరచాలనం చేస్తారు. కానీ.. పాక్ మాజీ క్రికెటర్ ఓ మహిళా అంపైర్‌ను హగ్ చేసుకోబోయాడు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మ్యాచ్ తర్వాత మహిళా అంపైర్‌ను హగ్ చేసుకోబోయాడు. కానీ.. రెప్పపాటులో తేరుకుని షేక్‌హ్యాండ్‌తో సరిపెట్టాడు. ఈ సంఘటన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో చోటు చేసుకుంది. ఇండియా మహరాజాస్-ఆసియా లయన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్రిదీ ఆసియా లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇండియా మహరాజాస్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నాడు. శుక్రవారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇండియా మహరాజాస్ తరఫున గంభీర్, హర్భజన్ సింగ్, రైనా, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, మొహమ్మద్ కైఫ్, మురళీ విజయ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగారు. అలాగే ఆసియా లయన్స్ తరపున అఫ్రిదీ, అబ్దుల్ రజాక్, ఇస్బా ఉల్ హక్, దిల్షాన్ లాంటి హేమాహేమీలు ఆడారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ తరంగా 39 బంతుల్లో 2 సిక్సులతో 40 పరుగులు చేసి రాణించాడు. దిల్షాన్‌ను ఆశోక్ దిండా ఆరంభంలోనే అవుట్ చేసి ఆసియా లయన్స్‌ను దెబ్బకొట్టాడు. కేవలం 5 పరుగులు చేసి దిల్షాన్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే అస్గర్ ఆఫ్ఘాన్ సైతం ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత.. మిస్బా ఉల్ హక్, తరంగాతో జత కలిసి ఆసియాను ఆదుకున్నాడు. 50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 73 రన్స్ చేసి అదరగొట్టాడు మిస్బా. అలాగే కెప్టెన్ అఫ్రిదీ 12, తిషారా పెరీరా 5, అబ్దుల్ రజాక్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో మొత్తం మీద ఆసియా లయన్స్.. ఇండియా మహరాజాస్ ముందు 166 పరుగుల టార్గెట్ ఉంచింది. మహరాజాస్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 1, దిండా 1, బిన్నీ 2, అవానా 2 వికెట్లు తీసుకున్నారు.
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇండియా మహరాజాస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాబిన్ ఊతప్పను తన్విర్ డకౌట్ చేశాడు. కానీ.. కెప్టెన్ గంభీర్ మాత్రం 39 బంతుల్లో 7 ఫోర్లతో 54 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే మురళీ విజయ్ సైతం 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేశాడు. సురేష్ రైనా 3 పరుగులు మాత్రమే చేసి.. నిరాశపరిచాడు. మొహమ్మద్ కైఫ్ 22, యూసుఫ్ పఠాన్ 14, స్టువర్ట్ బిన్నీ 8, ఇర్ఫాన్ పఠాన్ 19 రన్స్‌చేసి అవుట్ అయ్యారు. చివర్లో హర్భజన్ సింగ్ 5, అవానా ఒక రన్‌తో నాటౌట్‌గా నిలిచారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఇండియా మహరాజాస్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే హర్బజన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ చేసుకున్న అఫ్రిదీ.. అక్కడే ఉన్న అంపైర్‌ను హగ్ చేసుకోబోయాడు. కానీ.. వెంటనే తేరుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 11, 2023