భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురుంచి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. భర్త షోయాబ్ మాలిక్ తో విడిపోతున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పందించగా పోగా.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకొని అభిమానులకు షాకిచ్చింది. సానియా టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న సానియా, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ అనంతరం టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. అందులో సానియా తన టెన్నిస్ కెరీర్ ప్రయాణం, పోరాటం గురించి క్లుప్తంగా వివరించింది.
తన కలల పోరాటం 6 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైందని చెప్పిన సానియా, 30 సంవత్సరాల కిందట తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్ టెన్నిస్ కోర్టుకు వెళ్లానని, అమ్మ టెన్నిస్ నేర్పించమని కోచ్‌ని కోరిందని, అయితే అతను మాత్రం ఇంత చిన్న వయసులో టెన్నిస్ అవసరమా? అన్నాడని గుర్తు చేసుకుంది. కానీ, “ఆ పాప మాత్రం ఆరేళ్ల వయసులోనే తన కలల కోసం పోరాడడం మొదలెట్టింది. ఎన్నో కష్టాలు, మరెన్నో సమస్యలను అధిగమించి కెరీర్‌లో మొదటి గ్రామ్ స్లామ్ ఆడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే అతి గొప్ప గౌరవాన్ని పొందింది. ఇప్పుడు నా కెరీర్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటే 50కి పైగా గ్రాండ్ స్లామ్స్ ఆడాను.. వాటిలో కొన్ని టైటిల్స్ కూడా గెలిచాను. పోడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడడమే నా కెరీర్ లో నాకు దక్కిన అత్యున్నత గౌరవం. ఈ రిటైర్‌మెంట్ లేఖ రాస్తున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గర్వంతో నా మనసు ఉప్పొంగుతోంది..” అంటూ సానియా ఎమోషనల్ అయ్యింది.
అలాగే.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ భావోద్వేగానికి లోనైంది. కాగా, సానియా మోచేయి గాయం కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైన విషయం తెలిసిందే. వీటికి తోడు ఫిట్ నెస్ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఆమెను బాధించాయి. ఈ క్రమంలో గతేడాదే రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆ తరువాత మళ్ళీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొని తన కెరీర్ ప్రారంభమైన మొదటి గ్రాండ్ స్లామే తనకు చివరిది కావాలని ఆస్ట్రేలియన్ ఓపెన్ లో బరిలోకి దిగుతోంది. సానియా తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించింది. డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి నిలిచింది. సింగిల్స్ వరల్డ్ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది.