టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ నెల రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపు 40 రోజులుగా ఆస్పత్రి బెడ్ పై చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం పంత్ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక పంత్ మోకాలికి సర్జరీ జరగడంతో.. అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు పంత్ నుంచి శుభవార్త వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత పంత్ తొలిసారి బయటకి వచ్చి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాను అంటూ పోస్ట్ షేర్ చేశాడు.
రిషబ్ పంత్.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మోకాలికి జరిగిన సర్జరీ తర్వాత తొలిసారిగా బయట అడుగుపెట్టాడు రిషబ్ పంత్. బాల్కనీలో కూర్చున్న ఫోటోను పంత్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.”ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే.. ఇంత హాయిగా, ప్రశాంతంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు” అంటూ రాసుకొచ్చాడు పంత్. అయితే పంత్ షేర్ చేసిన ఫోటోను గమనిస్తే.. అతడు ఇంకా ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నాడని అర్ధమవుతోంది.
ఇక పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుని ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతుండటంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంత్ కోలుకోవడానికి మరిన్ని వారాలు పట్టడంతో.. అతడు ఈ ఏడాది జరిగే అన్ని సిరీస్ లకు దూరం కానున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఆసియా కప్ చివరికి వన్డే ప్రపంచ కప్ కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా, టీమిండియా దిగ్గజాలు కూడా కోరుకుంటున్నారు. పంత్ అవసరం టీమిండియాకు ఎంత ఉందో అతడి గబ్బా ఇన్నింగ్స్ ను చూస్తేనే తెలుస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.