అద్భుతం.. అమోఘం.. అద్వితీయం.. ఈ మాటలన్నీ అతడి బ్యాటింగ్ ని వర్ణించడానికి సరితూగవు. అంతలా అతడి పరుగుల ప్రవాహం కొనసాగింది. టీమిండియా జట్టులో చోటు దక్కించుకోలేక పోయినప్పటికీ తన ఆటను మాత్రం అద్వితీయంగా.. ఆస్వాదిస్తూ.. కొనసాగిస్తున్నాడు పృథ్వీ షా. తాజాగా జరుగుతున్న రంజీ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. గౌహతి వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ముంబై జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. మ్యాచ్ ప్రారంభం అయిన తొలిరోజు నుంచే అస్సాం బౌలర్లను ఊచకోత కోయడం మెుదలు పెట్టాడు షా. తనదైన మార్క్ షాట్స్ తో మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.
పృథ్వీ షా.. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెతకు అచ్చంగా సరిపోతాడు. దూకుడైన ఆటతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఈ యువ కెరటం. కానీ జట్టులో సుస్థిర స్థానాన్ని మాత్రం సంపాదించుకోలేక పోయాడు. జూనియర్ సెహ్వాగ్ గా పిలుపించుకుంటున్న షా.. అందుకు తగ్గట్లుగానే ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్నరంజీ మ్యాచ్ ల్లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం ఒకటిన్న రోజులోనే 379 పరుగులు సాధించి తన బ్యాటింగ్ పవర్ ఏంటో మరోసారి సెలెక్టర్లకు చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో 383 బంతులు ఎదుర్కొని 49 ఫోర్లు, 4 సిక్స్ లతో 379 పరుగులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు షా. దాంతో ముంబై 600 పరుగులను దాటింది.
ప్రస్తుతం రెండో రోజు ఆట కొనసాగిస్తున్న ముంబై జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 608 పరుగులతో ఆడుతోంది. క్రీజ్ లో కెప్టెన్ అజింక్య రహానే(139), సర్ఫరాజ్ ఖాన్(2) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే ఇంకా రెండు రోజుల ఆటకూడా పూర్తికాకుండానే షా 379 పరుగులు చేశాడు అంటే.. అతడు ఈ రోజు మెుత్తం క్రీజ్ లో ఉంటే.. 500 పరుగులు ఒక్కడే చేసేవాడు అని క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నప్పటికీ.. సెలక్టర్లు మాత్రం పృథ్వీ షాపై సీతకన్నే వేస్తున్నారు. ఇప్పటికైనా టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
3️⃣7️⃣9️⃣ – Prithvi Shaw smashes the second-highest score ever in the #RanjiTrophy 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2023