గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. భారత-పాక్ క్రికెటర్లు వరసపెట్టి పెళ్లి చేసేసుకుంటున్నారు. గత కొన్నిరోజుల నుంచి తీసుకుంటే.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హరీష్ రౌఫ్.. తమ భాగస్వామితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ లిస్టులోకి పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా చేరిపోయాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక పాక్ క్రికెటర్లందరూ కూడా అఫ్రిది పెళ్లిలో తెగ సందడి చేశారు.
ఇక విషయానికొస్తే.. ఈ ఏడాది ఆసియాకప్, టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ ఇలా చెప్పుకుంటూ పోతే మేజర్ టోర్నీస్ చాలానే ఉన్నాయి. అందుకేనేమో క్రికెటర్లందరూ కూడా ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ స్టార్ బౌలర్ అఫ్రిది.. మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షాని నిఖా(ముస్లిం సంప్రదాయంలో పెళ్లి) చేసుకున్నాడు. శుక్రవారం ఈ ఇద్దరూ కూడా ఒకటయ్యారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
షాహీన్-అన్సా ఎంగేజ్ మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది కానీ మధ్యలో అఫ్రిదికి ఉన్న క్రికెట్ షెడ్యూల్స్, గాయాల కారణంగా లేటవుతూ వచ్చింది. 2021 జులైలో శ్రీలంక టూర్ లో గాయపడ్డ షాహీన్ అఫ్రిది.. ఆసియాకప్ ఆడలేదు. టీ20 వరల్డ్ కప్ లో ఫిట్ నెస్ లేకపోయినా సరే ఆడి మళ్లీ గాయపడ్డాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తర్వాత ఖాళీగానే ఉన్నాడు. దీంతో ఇదే మంచి టైం అనుకున్న అఫ్రిది, పెళ్లికి రెడీ అయిపోయాడు. ఇదిలాఉండగా 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది 25 టెస్టుల్లో 99 వికెట్లు, 32 వన్డేల్లో 62 వికెట్లు, 47 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు.
Congratulations to Shaheen Shah Afridi on his Nikkah ceremony! ⭐ pic.twitter.com/OGuwdrYOo6
— Grassroots Cricket (@grassrootscric) February 3, 2023