ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం విండీస్ జట్టు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో కరేబియన్ జట్టులో విభేదాలు తలెత్తాయంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ప్రస్తుత వెస్టిండీస్ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ కు.. సీనియర్ ఆటగాళ్ళకు మధ్య దూరం పెరుగుతోందంటూ విండీస్ మీడియా పేర్కొంది. ముఖ్యంగా కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆల్ రౌండర్ ఓడిన్ స్మిత్ మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్లు తెలిపింది. తనను కీరన్ పొలార్డ్ ఉద్దేశపూర్వకంగా ఉపయోగించుకోలేదని స్మిత్ తోటి ఆటగాళ్లతో అన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను విండీస్ బోర్డు తీవ్రంగా ఖండించింది. జట్టులో అందరు బాగానే ఉన్నారని, ఆటగాళ్ల మధ్య ఎటువంటి అభిప్రాయబేధాలు లేవని పేర్కొంది.
ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్ లో ఓడిన్ స్మిత్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్ లో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. స్మిత్ ఈ విషయమై పొలార్డ్ తో గొడవ పెట్టుకున్నట్లు మీడియాలో కథనాలు వినిపిస్తుంటే.. వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్ వాదన మాత్రం మరో విధంగా ఉంది. జట్టులో ఏ ఆటగాడిని టార్గెట్ చేయడం లేదని, అలాంటి వాటికి జట్టులో ఆస్కారం లేదని సిమన్స్ మీడియా సమావేశంలో తెలిపారు. జట్టులోని ఆటగాళ్లందరూ కలిసికట్టుగానే ఉన్నారని పేర్కొన్నాడు.
ప్లేయర్ మార్పు విషయంలో ఓడిన్ స్మిత్ ను తీసుకోకపోవడానికి గల కారణాన్ని కోచ్ ఫిల్ సిమ్మన్స్ వివరించాడు. “మేమంతా కూర్చుని అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తాం. ఒక ఆల్ రౌండర్ గా రోమన్ పావెల్ మూడో టీ-20 కి ఉపయోగపడతాడు కాబట్టే స్మిత్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇందులో ఎవరిపై వివక్షత లేదు, అవసరాన్ని బట్టి జట్టులో మార్పులు జరుగుతుంటాయి” అని సిమ్మన్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లోవెస్టిండీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక మిగిలిన చివరి రెండు టీ-20లు జనవరి 29, 30 తేదీల్లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరగనున్నాయి.