ఇంగ్లండ్ సీనియర్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్ వింత రికార్డు సృష్టించాడు. 2002లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా.. టెస్టుల్లో 667 వికెట్లతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 954 వికెట్లు సాధించాడు. కానీ.. తొలి వికెట్ ఆనందాన్ని మరోసారి పొందాడు. 2003లో టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అండర్సన్ పాకిస్థాన్ గడ్డపై తొలి టెస్టు వికెట్‌ను సాధించాడు. తాజాగా రావాల్పిండి వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్‌కీపర్ కమ్ స్టార్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ తీయడంతో అండర్సన్ పాకిస్థాన్‌లో తొలి వికెట్ తీసుకున్నాడు. దీంతో అతని మొత్తం అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 955కు చేరుకుంది. ఈ అరుదైన రికార్డు విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. 954 వికెట్ల తీసిన బౌలర్ తొలి వికెట్ అనుభూతి పొందుతున్నాడు అంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
అయితే.. ఈ అరుదైన ఫీట్ వెనుక కూడా పాకిస్థాన్ ఉంది. 17 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి జట్టులో సైతం అండర్సన్ కూడా ఉన్నాడు. కానీ.. అప్పుడు అండర్సన్‌కు వికెట్ దక్కలేదు. ఆ తర్వాత.. పాకిస్థాన్‌లో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి తర్వాత.. ప్రపంచ దేశాలు క్రికెట్ ఆడేందుకు పాకిస్థాక్‌కు వెళ్లడం మానేశాయి. దీంతో యూఏఈ వేదికగా పాకిస్థాన్ ఇతర జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. తిరిగి ఈ మధ్యనే 2021లో న్యూజిలాండ్ మేకపోతు గాంభీర్య ప్రదర్శించి పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు వెళ్లింది. కానీ.. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు భద్రతా కారణాల దృష్ట్యా సిరీస్‌ను రద్దు చేసుకుని కివీస్ జట్టు మూటాముళ్లే సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాళ్లావేళ్లా పడి ఆస్ట్రేలియా టీమ్‌ను పాకిస్థాన్‌కు తీసుకొచ్చి పాక్ క్రికెట్ బోర్డు. ఆ తర్వాత.. ఇంగ్లండ్ వచ్చి వరల్డ్ కప్ ముందు 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. మళ్లీ వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్ జట్టే.. మూడు టెస్టులు ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టింది.
అయితే.. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పాకిస్థాన్‌కు రావడం విశేషం. దీంతో ఈ జట్టులోనూ సభ్యుడిగా ఉన్న అండర్సన్ మళ్లీ పాకిస్థాన్‌కు టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చాడు. తొలి టెస్టు మూడో రోజు రిజ్వాన్‌ను అవుట్ చేసి పాకిస్థాన్ గడ్డపై తొలి టెస్టు వికెట్‌ను సాధించాడు. దీంతో 22 ఏళ్ల కెరీర్ ఉండి.. 954 అంతర్జాతీయ వికెట్లు ఉండి.. పాక్ గడ్డపై తొలి టెస్ట్ వికెట్‌ను ఇప్పుడు సాధించినట్లు అయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(114), ఇమామ్-ఉల్-హక్(121)తో పాటు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్(136) సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన భారీ స్కోర్‌కు పాక్ కూడా ధీటుగానే బుదులిచ్చింది. కాగా.. పిచ్ మరీ ఫ్లాట్‌గా ఉందని, హైవే రోడ్డును తలపిస్తుందని రావాల్పిండి పిచ్‌పై విమర్శలు వస్తున విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌తో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు బాదగా.. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీ చేశాడు. ఈ పిచ్ బ్యాటింగ్ స్వర్గధామనంగా ఉండగా.. బౌలర్ల పాలిట శాపంగా మారింది.
668 Test wickets 🎯
First on Pakistan soil for @jimmy9 ☝️#PAKvENG | #UKSePK pic.twitter.com/ZnGBDVlHfa— Pakistan Cricket (@TheRealPCB) December 3, 2022