అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ కి టీమిండియాని ప్రకటిచేశారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకి తొలిసారి వన్డేల్లో చోటు దక్కడం విశేషం.
మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ కి తాజాగా భారత జట్టుని ప్రకటించేశారు. గత కొన్ని రోజులుగా జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది అనే ప్రశ్నలకు సెలక్టర్లు తాజాగా క్లారిటీ ఇచ్చేసారు. సోమవరం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఈ జట్టుని ఖరారు చేశారు. ఈ మీటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు .. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొన్నాడు. 17 మందిని సెలక్ట్ చేసిన ఈ స్క్వాడ్ లో తొలిసారి తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. ఇటీవలే విండీస్ తో ముగిసిన టీ 20 సిరీస్ లో ఈ యంగ్ ప్లేయర్ టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక గాయాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించారు. మరో వైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కి ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినా..అతన్ని స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేశారు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. అనుకున్నట్లుగానే బూమ్రా, సిరాజ్, మహమ్మద్ షమీ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. ఇటీవలే ఐర్లాండ్ తో టీ 20ల్లో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న ప్రసిద్ కృష్ణ స్థానం సంపాదించుకోవడం గమనార్హం. స్పిన్ బౌలింగ్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ కి మరోసారి నిరాశే ఎదరైంది. కుల్దీప్ యాదవ్ ని ప్రధాన స్పిన్నర్ గా సెలక్ట్ చేయగా.. జడేజా, అక్షర్ పటేల్ రూపంలో మరో ఇద్దరు స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. ఇక టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా సెలక్ట్ అయ్యాడు. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్థాన్-నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2 న జరగనుంది. మరి ఈ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.