భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక కల నెరవేరబోతోంది! ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్, సాంబా ఫుట్‌బాల్ కింగ్స్ ‘బ్రెజిల్’ తో మన టీమిండియా తలపడటానికి రంగం సిద్ధమైంది. సాల్ట్ లేక్ స్టేడియం సాక్షిగా జరగబోయే ఈ చరిత్రాత్మక మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… కోల్‌కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7:30 గంటలకు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ పురుషుల విభాగంలో భారత్-బ్రెజిల్ ముఖాముఖిగా పోటీపడటం ఇదే తొలిసారి!
FIFA ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్ 5వ స్థానంలో ఉంటే, మన భారత్ 138వ స్థానంలో ఉంది. గతంలో 1995లో రష్యా (9వ ర్యాంక్), 1998లో జపాన్ (9వ ర్యాంక్) లతో ఆడటమే ఇప్పటివరకు భారత్ ఎదుర్కొన్న అత్యుత్తమ ప్రత్యర్థులు. ఇప్పుడు అంతకంటే బలమైన 5వ ర్యాంకర్ బ్రెజిల్‌ను ఢీకొట్టబోతోంది..ఇటీవల 44వ ర్యాంకర్‌గా ఉన్న పనామాను 1-1తో డ్రా చేసుకొని మన జట్టు ఫుల్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ మ్యాచ్‌లో రాయన్ విలియమ్స్ గోల్‌తో సత్తా చాటాడు.
మరోవైపు బ్రెజిల్ జట్టు దిగ్గజ కోచ్ కార్లో అన్‌సెలొట్టి మార్గదర్శకత్వంలో లీడ్ అవుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఆడిన 19 మ్యాచ్‌లలో 11 విజయాలు సాధించి బ్రెజిల్ అజేయంగా కొనసాగుతోంది. అయితే, తొడ కండరాల గాయం కారణంగా స్టార్ వింగర్ ‘రాఫిన్హా’ ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం భారత్‌కు కాస్త ఊరట కలిగించే అంశం.
కోల్‌కతాకు, బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు విడదీయరాని సంబంధం ఉంది. 1977లోనే లెజెండ్ ‘పీలే’ కోల్‌కతాలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. పెరూ, ఉరుగ్వే తర్వాత భారత్ ఎదుర్కొంటున్న మూడో దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్.ఈ చరిత్రాత్మక మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ (Sony Sports) ఛానెళ్లలో, డిజిటల్‌గా సోనీ లివ్ (Sony LIV) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
