భారతదేశంలో చాలా మంది ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది యువత లక్ష్యం మాత్రం IAS, IPS లు కావడమే. ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ దేశానికి సేవచెయ్యాలనే తపన వారిలో ఉంటుంది. అయితే షార్ట్ కట్ లో సివిల్స్ ఎగ్జామ్ అంత కఠినమైన పరీక్ష మరోకటి ఉండదని పేరుకూడా ఉంది. అదీకాక సివిల్స్ పరీక్ష ఏటా లక్షల మంది రాస్తున్నప్పటికీ.. సివిల్స్ క్లియర్ చేసేవారి సంఖ్య మాత్రం వందల్లో ఉంటుంది. మరి ఇంతటి క్రేజ్, కఠినమైన UPSC ఎగ్జామ్ ను మన టీమిండియా క్రికెటర్ క్లియర్ చేశాడు అన్న సంగతి చాలా మందికి తెలియక పోవచ్చు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్.. సగటు భారతీయ అభిమానుల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆట. అందుకే చిన్న పిల్లవాడు సైతం బ్యాట్ బాల్ పట్టుకుని గ్రౌండ్ లోకి పరిగెడుతుంటాడు. ఇక ఆటల్లో పడి.. చదువును ఎక్కడ ఆగం చేసుకుంటాడో అని ప్రతి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. ఇక టీమిండియాలో ప్రస్తుతం, గతంలో ఆడిన ఆటగాళ్లలో చాలా మంది టెన్త్, ఇంటర్, డిగ్రీ వరకే చదివి, చదువును మధ్యలో ఆపేసిన ఆటగాళ్లే ఎక్కువ. కానీ అందరు అలా ఉండరు అని నిరూపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్ లో జన్మించిన ఖురేషియా.. చిన్న తనం నుంచే చదువుల్లో చాలా చురుకు. చదువుల్లోనే ఆటలో కూడా ముందుండే వాడు. అందుకే 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కానీ చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూనే సివిల్స్ ఎగ్జామ్ ను క్లియర్ చేశాడు. సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన కొద్ది రోజుల్లోనే టీమిండియా నుంచి ఖురేషియాకు పిలుపు వచ్చింది.
దాంతో తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంటూ.. టీమిండియాలోకి అడుగుపెట్టాడు ఖురేషియా. 1999లో పెప్సీ కప్ లో శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ లో భాగంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు ఖురేషియా. తన తొలి మ్యాచ్ లోనే అర్ధశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం అతడికి మరికొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. దాంతో జట్టులో స్థానం కోల్పోయి నెమ్మదిగా కనుమరుగైయ్యాడు. ఇక ఖురేషియా కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడి 149 పరుగులు సాధించాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు. 199 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి.. 21 సెంచరీలతో 7304 పరుగులు చేశాడు. 2007లో తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఖురేషియా. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు.