అర్షదీప్ సింగ్.. ఆసియా కప్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వినిపించిన పేరు. ఆసియా కప్ లో భాగంగా పాక్ తో మ్యాచ్ లో పాక్ బ్యాటర్ అలీ క్యాచ్ మిస్ చేయడంతో.. ఈ మ్యాచ్ లో భారత్ ఒడిపోయి, ఇంటిదారి పట్టింది. దాంతో ఒక్కసారిగా అతడిపై విమర్శల వర్షం కురిసింది. అర్షదీప్ పై విమర్శలు చినికి చినికి గాలివాన అయినట్లు.. ఏకంగా అతడి వికిపీడియాలో కలిస్థాన్ అని మార్చేవరకు వెళ్లింది. దాంతో కేంద్రం ఈ విషయాన్ని సిరీయస్ గా తీసుకుని వికిపీడియాకు సమన్లు పంపిన సంగతి మనకు తెలిసిందే. ఈ సంఘటన తర్వాత గొప్పగా పుంజుకున్నాడు అర్షదీప్ సింగ్. తర్వాత జరిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ల్లో గొప్పగా రాణించాడు. అదీకాక ప్రస్తుతం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై ప్రశంసలు కురిపించాడు దక్షిణాఫ్రికా స్టార్ జాంటీ రోడ్స్. అతడి బౌలింగ్ ను ఏ ఆటగాడితో పోల్చడం కుదరదు.. అలా పోల్చకండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ దళాన్ని అన్ని తానై నడిపిస్తున్నాడు అర్షదీప్ సింగ్. కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో.. బౌలింగ్ దళానికి వెన్నుముకగా మారాడు అర్షదీప్. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సలహాలతో అద్భతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అర్షదీప్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సౌతాఫ్రికా వెంటరన్ స్టార్ జాంటీ రోడ్స్. అర్షదీప్ ను పాక్ ఆటగాడితో పోల్చి అతడిపై ఒత్తిడి పెంచొద్దు అంటూ సూచించాడు. అర్షదీప్ బౌలింగ్ పై జాంటీ రోడ్స్ మాట్లాడుతూ.. “టీమిండియాలో ఫాస్ట్ బౌలర్లు చాలా తక్కువ టైమ్ లో ఎదుగుతారు. దానికి చక్కని ఉదాహరణ బుమ్రానే. అతడిలానే అర్షదీప్ సైతం తక్కువ టైమ్ లోనే టీమిండియాలో గొప్ప బౌలర్ గా ఎదిగాడు. అత్యంత కఠినమైన గ్రౌండ్స్ లో సైతం వికెట్లు తీయగల సత్తా అతడిలో ఉంది. బాల్ ను స్వింగ్ చేసి వికెట్లు తీయడంలో అర్షదీప్ సిద్దహస్తుడని” జాంటీ అర్షదీప్ ను కొనియాడాడు.
అయితే అతడిని పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ తో పోల్చకండి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వింగ్ కు పెట్టింది పేరు వసీం అక్రమ్.. వికెట్లు తీయడంలో ఇతడు ఎంతో నియంత్రణ చూపుతాడు. ఈ రెండు విషయాల్లో ఇద్దరికి దగ్గిరి పోలికలు ఉండోచ్చు అంతమాత్రానా అర్షదీప్ ను అక్రమ్ తో పోల్చలేం అని జాంటీ అన్నాడు. అర్షదీప్ వేసిన కొన్ని కొన్ని బంతుల ముందు ఒక్కోసారి అక్రమ్ కూడా పనికిరాడనిపిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ సౌతాఫ్రికా స్టార్. ఇలా మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాళ్లను వేరొకరితో పొల్చడంతో.. సహజంగానే వారిపై ఒత్తిడి పెరుగుతుందని జాంటీ రోడ్స్ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్ తో జరిగే టీ20, వన్డే సిరీస్ యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశమని, దానిని వారు వినియోగించుకోవాలని సూచించాడు.