‘ఐ యామ్ సింగిల్.. వాంట్ టు మింగిల్’, ‘బోర్ గా ఫీలవుతున్నారా?.. నాతో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే వెంటనే కాల్ చేయండి’.. ఇలాంటి ఊరించే మెసేజ్‌లు అందరకి వస్తుంటాయి. నిజమని నమ్మి కాల్ చేశామా! ఆ తీయని వలపు సంభాషణలు విని కాలర్ ఎగరేసుకుంటూ వెళ్తుంటారు. అక్కడకి వెళ్ళాక నిజంగానే.. అక్కడ అన్నీ అనుభవాలు దొరుకుతాయి. కాకుంటే ఈ తతంగాన్ని ఒక సినిమాలా చిత్రీకరిస్తారు. ఆ తరువాత జరిగేది ఊహించదగినదే. హనీ ట్రాప్ ఉచ్చులో ప్రముఖలు. ఇలాంటి వార్తలు ఎన్ని చూడట్లేము. అయినా ఈ మాయలో పడేవారు ఇంకా ఉన్నారంటే నమ్మొచ్చు. తాజాగా, ఢిల్లీకి చెందిన ఓ యువ క్రికెటర్ ఈ ఉచ్చులో పది అందినకాడికి సమర్పించుకున్నాడు.
ఢిల్లీ క్రికెటర్ వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో భాగంగా కోల్‌కతాలో జరిగే మ్యాచుల కోసం అక్కడకి వెళ్లాడు. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఒక లక్సరీ హోటల్ లో బస చేశాడు. అక్కడ అతడికి డేటింగ్ యాప్ ద్వారా కొందరు వ్యక్తులు పరిచయం అయ్యారు. అమ్మాయి కావాలంటే.. నవంబర్ 1న బిధాన్‌నగర్ సిటీ పోలీస్ పరిధిలోని బగుయాటి ప్రాంతంలో ఉన్న బస్ స్టాప్ రావాలని సూచించారు. వైభవ్ అక్కడకి వెళ్లి వారిని కలిశాడు. కొందరు మహిళల ఫొటోలు చూపించి.. వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఓ యువతిని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో ఆ యువతి అతడి హొటల్ కు వచ్చింది. ఆ క్రికెటర్ తో సన్నిహితంగా గడిపింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. అయితే.. సదరు యువతి వారిద్దరు ఏకాంతంగా ఉన్న క్షణాలను రికార్డు చేసింది. ఈ విషయం ఆ క్రికెటర్ కు తెలియదు. అన్నీ అవ్వగానే అక్కడి నుంచి జారుకుంది.
ఆ తరువాత ముందు బస్ స్టాప్ కు రమ్మన్న వ్యక్తులు రంగప్రవేశం చేశారు. నీ వీడియోలు రికార్డు చేశాం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎక్కడ పరువుపోతుందో అన్న ఉద్దేశ్యంతో ఆ క్రికెటర్ తన వద్ద ఉన్న 60వేల వరకు సొమ్ము, బంగారపు గొలుసు, ఖరీదైన మొబైల్ ఫోన్‌ను కూడా వారికి ఇచ్చాడు. ఇక్కడితో వారి వేధింపులు ఆగలేదు. మళ్లీ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో విసిగిపోయిన బాధిత క్రికెటర్ నవంబర్ 2న స్థానిక బగుయాటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి.. తనకు ఎదురైన అనుభవాన్ని వారికి వివరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు శుభంకర్ బిస్వాస్, రిషబ్ చంద్ర, శివ సింగ్లను అరెస్ట్ చేసి బారాసత్ కోర్టులో హాజరుపరిచారు.