ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో చాలా కాలంగా సరైన ఫామ్‌లోలేని వార్నర్.. తన పరుగుల దాహాన్ని కసితీరా తీర్చుకున్నాడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ ముఖం చూడని వార్నర్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 254 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 200 కొట్టిన వార్నర్.. చాలా కాలంగా రాని సెంచరీని దాటి.. ద్విశతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరో విషయం ఏమిటంటే.. ఈ టెస్టు డేవిడ్ వార్నర్ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్. తన వందో టెస్టులో సెంచరీ చేసి అదరగొట్టిన వార్నర్.. దాన్ని డబుల్ సెంచరీగా మలిచి.. చరిత్ర సృష్టించాడు. 100వ టెస్టు ఆడుతూ.. డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా, ప్రపంచంలో రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
గతంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ సైతం తన వందో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. ఏడాది తిరగకముందే.. ఇప్పుడు వార్నర్ సైతం తన వందో టెస్టులో 200 పరుగులు బాదడం విశేషం. ఇక సౌతాఫ్రికాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆడుతూ.. 81 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. ఇందులో వార్నర్ ఒక్కడివే 200 రన్స్ ఉన్నాయి. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వార్నర్.. తన పూర్వపు ఫామ్‌ను కనబరుస్తూ.. ప్రొటీస్ బౌలర్లపై పూర్తి ఆధిప్యతం చెలాయించాడు. ఫస్ట్ బాల్ నుంచి మంచి టచ్‌లో కనిపించిన వార్నర్.. రబాడా, లుంగీ ఎన్గిడి, మార్కో జాన్సన్, అన్రిచ్ నూర్జే, కేశవ్ మహరాజ్‌లతో కూడిన పటిష్టమైన సౌతాఫ్రికా బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. పరుగుల వరద పారించాడు.
ఓపెనర్ ఖవాజా(1), మార్కస్ లబుషేన్(14) వెంటనే అవుటైనా.. స్టీవ్ స్మిత్(85)తో కలిసి.. 200 పైచిలుకు భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. వందో టెస్టులో వంద కొట్టిన పదో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ సెంచరీని మరింత వేగంగా ఆడి.. డబుల్ సెంచరీకి కన్వర్ట్ చేసి చరిత్ర సృష్టించాడు. కాగా.. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ఆడిన సౌతాఫ్రికా.. 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగడంతో ప్రొటీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా.
ఈ దశలో కైల్ వెర్రెయిన్నే(52), మార్కో జాన్సన్(59) పరుగులతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. వారిద్దరు అవుట్ అయిన తర్వాత మళ్లీ వికెట్ పతనం మొదలైంది. దీంతో.. సౌతాఫ్రికా 189 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా.. ఈ మ్యాచ్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వార్నర్.. డబుల్ సెంచరీ చేసిన ఆనందంలో గాల్లోకి ఎగిరి సంబురాలు జరుపుకుంటున్న క్రమంలో గాయపడ్డాడు. గాల్లోకి ఎగిరి దూకే క్రమంలో కాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరి ఈ మ్యాచ్‌లో వార్నర్ డబుల్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A double century for David Warner!
But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa
— cricket.com.au (@cricketcomau) December 27, 2022