ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో ఆ స్టార్ ఆటగాడు లేకపోవడంతోనే ఇంత ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పాక్ మాజీ ఆటగాడు తన అభిప్రాయాలన్ని వ్యక్తం చేశాడు. మరి ఆ స్టార్ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లయింది టీమిండియా పరిస్థితి. స్పిన్ ట్రాక్ తయారు చేసి ముచ్చటగా మూడోసారి ఆస్ట్రేలియాను మట్టికరిపిద్దాం అనుకున్న భారత్‌కు మూడో టెస్ట్ లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఈ క్రమంలో భారత ఓటమిపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే టీమిండియాలో ఆ ఒక్క ఆటగాడు లేకపోవడమే భారత ఓటమికి కారణమంటూ.. టీమిండియాలో అతడు లేని లోటు స్పష్టంగా కనపడుతోంది అని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.
ఈ సందర్భంగా కనేరియా మాట్లాడుతూ.. ‘టీమిండియా గత కొంత కాలంగా పంత్ సేవలను కోల్పోయింది. భారత జట్టులో రిషభ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. పంత్ జట్టులో ఉంటే ఆసీస్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగేవాడు. లియాన్ , కుహన్ మెన్ మీద ఎటాకింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టేవాడు. పిచ్ ఎలాంటిదైనా బంతిని స్టాన్డ్స్ కి పంపించడమే అతనికి తెలుసు’ అంటూ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ పాక్ మాజీ క్రికెటర్. ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడలేక బాగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కనీసం ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలదొక్కునే ప్రయత్నం చేయలేదు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పిచ్ ఎలాగున్నా భారత బ్యాటింగ్ లైనప్ స్వదేశంలో ఇలా విఫలమవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే 30 ప్లస్ రన్స్ చేసాడంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ వైఫల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు స్పిన్నర్లకు ఏకంగా 18 వికెట్లు సమర్పించుకున్నారు భారత బ్యాటర్లు. ఈ పరిస్థితుల్లో రిషభ్ పంత్ జట్టులో ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరేగా ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయాపడుతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా స్పిన్నర్లపై ఎటాకింగ్ గేమ్ తో పంత్ ఆధిపత్యం చెలాయించేవాడు. కానీ ఇప్పుడు అలాంటి ఎటాకింగ్ గేమ్ ఆడే ప్లేయర్ టీమిండియాలో కనిపించడం లేదు. ఇదే టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందని, ఈ క్రమంలో పంత్ లేని లోటు స్పష్టం కనిపిస్తోందని కనేరియా అభిప్రాయాపడ్డారు. మరి పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా, పంత్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.