గత కొంత కాలంగా పాకిస్థాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు, జట్టులో ఆటగాళ్లకు.. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజమ్ కు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాక్ ఘోరంగా ఓటమి చెందింది. దాంతో పాకిస్థాన్ అభిమానులు ఇటు బోర్డ్ పైనా, అటు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ పైనా ఆగ్రహంగా ఉన్నారు. ఇన్ని సంఘటనల మధ్య తాజాగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాక్ బోర్డ్ పై కోపంతో బాబర్ రెండో టెస్ట్ లో ఫీల్డింగ్ చేయడానికి నిరాకరించాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది పాక్. అందులో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. దాంతో ఇటు పాక్ కెప్టెన్ బాబర్ పై.. అటు పీసీబీ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రజాపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పై బాబర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ తో కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో రెండో రోజుకు ముందు రోజు రాత్రి డిన్నర్ కు వెళ్లే సమయంలో సెక్యూరిటీతో బాబర్ కు గొడవ జరిగింది. అదేంటంటే? బాబర్ మరికొంత మంది పాక్ ఆటగాళ్లతో రాత్రి డిన్నర్ చేయడానికి దగ్గర్లోని రెస్టారెంట్ కు వెళ్లబోయాడు. అప్పుడు సెక్యూరిటీ వారిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నించాడు.
అదీకాకా బాబర్ ఒక్కడికే బయటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. దాంతో బాబర్ కు కోపం వచ్చింది. మరుసటి రోజు ఆటకు రాకుండా తలనొప్పి అని చెప్పి.. మైదానంలోకి రాలేదు. అయితే అసలు విషయం ఏంటంటే? బాబర్ కు అసలు తలనొప్పే లేదంట.. రాత్రి జరిగిన గొడవ కారణంగానే బాబర్ అలిగాడని అక్కడి క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ విషయమై పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందించాడు.”ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంపై పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా స్పందించాలని, కెప్టెన్, బోర్డ్ ల మధ్య ఇలాంటి వివాదాలు రాకుడదు. బాబర్ సెక్యూరిటీతో జరిగిన గొడవ కారణంగానే మైదానంలోకి రాకుండా నిరసన తెలిపాడు” అని లతీఫ్ పేర్కొన్నాడు.
అయితే ప్రోటోకాల్ లో భాగంగానే నేను సెక్యూరిటీ విషయాలు అడిగానని సదరు సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పుకొచ్చాడు. ఇక మూడో టెస్ట్ లో సైతం పాక్ ఓటమి చెందడం ఖాయంగా కనిపిస్తోంది. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 304 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 216 రన్స్ కే కుప్పకూలింది. ఇక ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 354 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 17 ఓవర్లలో 2 వికెట్లకు 112 పరుగులతో ఉంది. మరో 55 పరుగులు చేస్తే టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్విప్ చేస్తుంది ఇంగ్లాండ్. దాంతో పాక్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ కు ఇది మరో పెద్ద సమస్యగా మారబోతోంది.