వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి సరిగ్గా రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే మెగాటోర్నీ జోష్ ప్రారంభమైంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ మరో రెండు నెలల్లో స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఫేవరెట్.. ఏ జట్టు అండర్ డాగ్ అనే ఊహగనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగాటోర్నీలో భారత్ ప్రధాన పోటీ దారు అని పేర్కొన్న ఈ పేస్ లెజెండ్ టీమిండియాతో పాటు.. మరో మూడు జట్లకు ప్రధానంగా అవకాశాలు ఉన్నాయని అన్నాడు. అందులో తన సొంత దేశమైన ఆస్ట్రేలియాతో పాటు, ఇంగ్లండ్, పాకిస్థాన్ కు కూడా చాన్స్ లు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించాడు.
అక్టోబర్ 5 న గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి పోరు జరుగనుండగా.. ఈ మ్యాచ్ కు ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) వేదిక కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీ లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన 9 జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ లో మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ లో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తో పాటు పాకిస్థాన్ కు కూడా ప్రపంచకప్ నెగ్గే అవకాశాలున్నాయని మెక్ గ్రాత్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ రికార్డుల్లోకెక్కిన ఈ కంగారూ పేసర్ ఈ నాలుగు జట్లు సెమీస్ చేరొచ్చని జోస్యం చెప్పాడు.
నవంబర్ 19న అహ్మదాబాద్ లో జరుగనున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఈ నాలుగు జట్లలో రెండే పాల్గొంటాయని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీ కోసం భారత్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. ఆ తర్వాత ఆసియా కప్ దాయాది పాకిస్థాన్ తో తలపడనుంది. మరి పుష్కర కాలం క్రితం భారత్ లో జరిగిన మెగాటోర్నీలో ధోనీ సారథ్యంలోని టీమిండియా కప్పు నెగ్గగా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా చూడాలి.