అంబటి తిరుపతి రాయుడు.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన ఆటతో అందర్ని ఆకట్టుకున్న ఈ తెలుగు తేజం.. అదృష్టం కలిసిరాక అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలకున్నా.. తన ఆటతో ఐపీఎల్‌ను శాసిస్తున్నాడు. కాకుంటే.. రాయుడు కేవలం తన ఆట తీరుతో మాత్రమే కాకుండా తన ఆటిట్యూడ్ తో కూడా వార్తల్లొ నిలుస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో ఎప్పుడూ గొడవలే. తాజాగా, దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ తప్పెవరిదో తెలియనప్పటికీ రాయుడు, షెల్డన్ జాక్సన్ మధ్య భారీ యుద్ధమే జరిగింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం సౌరాష్ట్ర, బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్.. ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా ‘నువ్వెంత అంటే నువ్వెంత..’ అంటూ కొట్టుకోవడానికి ఎదురెదురు పడ్డారు. ఆ సమయంలో అంపైర్లు, కృనాల్ పాండ్యా జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సౌరాష్ట్ర బ్యాటర్ షెల్డన్ జాక్సన్ బ్యాటింగ్ చేయడానికి ఆలస్యం చేస్తుండటమే అందుకు కారణమని తెలుస్తోంది. జాక్సన్ బాల్.. బాల్ కు ఇలానే చేస్తుండడంతో.. ఆగ్రహానికి లోనైన రాయుడు, దీని గురించి అంపైర్‌ను ప్రశ్నించాడు. తన అసంతృప్తిని ప్రదర్శించాడు. ఇది విన్న జాక్సన్.. రాయుడు మీదికొచ్చాడు. ఇంతలో కృనాల్ పాండ్యా పరిగెత్తుకుంటూ వచ్చి రాయుడును పక్కకు తీసుకెళ్లాడు. మరో ఫీల్డర్ జాక్సన్ ను క్రీజులోకి తీసుకెళ్లాడు. గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Rayudu Vs Sheldon Jackson verbal fight..
SMAT 2022, Baroda vs Saurashtra pic.twitter.com/0d9OBr8EMf
— Govardhan Reddy (@gova3555) October 12, 2022
ఈ మ్యాచులో సౌరాష్ట్ర, బరోడాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగా, సౌరాష్ట్ర 2 బంతులు మిగిలిఉండగానే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచులో బరోడా కెప్టెన్ రాయుడు తొలి బంతికే ఉనద్కట్ కు వికెట్ సమర్పించాడు. సౌరాష్ట్ర బ్యాటర్లలో సమర్థ్ వ్యానస్ (97; 52 బంతుల్లో, 5 ఫోర్లు, 9 సిక్సులు) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
రాయుడు సహజంగానే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేడు. గుంటూరు మిర్చిలా ముక్కుసూటిగా ఉండే అతను అనవసర గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. రంజీ క్రికెట్ ఆడే సమయంలో భారత దిగ్గజ క్రికెటర్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌తో గొడవపెట్టుకున్నాడు. భౌతికంగా కూడా కొట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రాయుడి కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. శివలాల్ యాదవ్ నుంచి అతనికి సమస్యలు ఎదురయ్యాయి. దాంతో 21 ఏళ్ల వయసులోనే బీసీసీఐకి రెబల్‌గా ఏర్పడిన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో చేరి మరో తప్పిదం చేశాడు. దాంతో అతనిపై నిషేధం పడింది. ఇలా ఒక్కటి కాదు.. రాయుడు కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి.