అగ్రెసివ్ అప్రోచ్‌తో టెస్టు క్రికెట్‌కు కొత్త కళ తీసుకొస్తున్న ఇంగ్లండ్.. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పాక్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు దాదాపు 17 ఏళ్ల తర్వాత ధైర్యం చేసి.. పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టులో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. హైవేలాంటి ఫ్లాట్ పిచ్‌ను ఏర్పాటు చేస్తున్నా.. తమ అగ్రెసివ్ గేమ్‌తో తొలి టెస్టులో విజయం సాధించింది. కానీ.. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం ఇంగ్లండ్ అగ్రెసివ్ గేమ్‌కు తొలి టెస్టు ఆడుతున్న పాక్ డెబ్యూ బౌలర్ అబ్రార్ అహ్మద్ అడ్డుకట్ట వేస్తున్నాడు. రెండో టెస్టులోనూ టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. మళ్లీ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలి మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద ఖాయం అనుకున్నారు క్రికెట్ అభిమానులు.
కానీ.. ఫ్యాన్స్ ఆశలను, ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్‌కు కళ్లెంవేస్తూ.. సంచలన బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. తొలి టెస్టులో తొలి రోజే 506 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ ప్రస్తుతం రెండో టెస్టు తొలి రోజు ఆటలో 45 ఓవర్లలో 229 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌ను ఇంతలా ఇబ్బంది పెడుతున్న బౌలర్ ఒకే ఒక్కడు అబ్రార్ అహ్మద్. ముల్తాన్ వేదికగా జరగుతున్న ఈ టెస్టుతోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి అబ్రార్ తొలి టెస్టుల్లోనే తన మిస్టరీ స్పిన్‌తో సంచలనం నమోదు చేస్తున్నాడు. తొలి 7 వికెట్లు అతనే పడగొట్టడం విశేషం. అబ్రార్‌ను ఎదుర్కొడానికి ఇంగ్లండ్ బౌలర్లు అపోసోపాలు పడుతున్నారు.
అతని బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగి అగ్రెసివ్‌గా ఆడాలని ప్రయత్నిస్తూ.. అతని మిస్టరీ స్పిన్‌కు బొక్కబోర్లా పడుతున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. లంచ్ తర్వాత కూడా చెలరేగిన అబ్రార్ 19 ఓవర్లు వేసి 91 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. తొలి టెస్టులో సెంచరీలతో రెచ్చిపోయిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, హెర్రీ బ్రూక్.. అబ్రాక్ స్పిన్ మ్యాజిక్‌కు వికెట్ సమర్పించుకున్నారు. వీరిలో బెన్ డకెట్ 63, ఓల్లీ పోప్ 60 పరుగులతో రాణించారు. కానీ.. జాక్ 19, బ్రూక్ 9, జో రూట్ 8 పరుగులు చేసి విఫలం అయ్యారు. ఓపెనర్‌ను జాక్‌ను అబ్రార్ క్లీన్ బౌల్డ్ చేసిన బాల్ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది.
ఎవరీ అబ్రార్..
పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా సంచలన బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ పేరుతెచ్చుకున్నాడు. కరాచీకి చెందిన అబ్రార్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కేవలం 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 76 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు సార్లు 10 వికెట్ల హాల్, 7 సార్లు 5 వికెట్లు హాల్, మూడుసార్లు 4 వికెట్ల హాల్ సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అయితే.. అబ్రార్, పాకిస్థాన్‌లోని అబోటాబాద్ సమీపంలోని మన్సెహ్రా శివార్లలోని షింకియారీ అనే చిన్న గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి 1977లో కరాచీకి వెళ్లి అక్కడే స్థిరపడటంతో.. అబ్రార్ అక్కడే పుట్టి పెరిగాడు. అబ్రార్ తండ్రికి క్రికెట్ అంటే ప్రాణం. పాకిస్థాన్ టీమ్‌కు ఆయన వీరాభిమానిగా ఉండేవాడు. ఎనిమిది మంది సంతానంలో అబ్రార్ అందరి కంటే చిన్నవాడు. తన నలుగురు అన్నల్లో ఒకతను దేశవాళీ క్రికెట్ ఆడాడు.
అబ్రార్ కూడా క్రికెట్‌పై ఇష్టం.. స్పిన్ బౌలర్‌గా మారాడు. కానీ.. తన తల్లి కోరిక మేరకు రెండేళ్లు క్రికెట్‌కు పూర్తిగా దూరమై.. చదువుపై దృష్టిపెట్టాడు. ఇస్లామిక్ స్టడీస్‌లో పెద్ద చదువులు కూడా చదవాలనే తన తల్లి ఆదేశాలను ధిక్కరించి.. క్రికెటర్ అవుతానని తల్లి వద్ద అనుమతి తీసుకుని.. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అదే సమయంలో పాకిస్థాన్ అండర్ 19 కోచ్ మన్సూర్ దృష్టిలో పడటంతో.. అబ్రార్ దశ తిరిగిపోయింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ప్రదర్శన కనబర్చడంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు టెస్టు సిరీస్ కోసం ఎంపికయ్యాడు. కానీ.. తొలి టెస్టులో అబ్రార్‌కు స్థానం దక్కలేదు. అతని స్థానంలో చాలా ఏళ్లుగా టీమ్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్న జాహిద్ మహమూద్‌ను కెప్టెన్ బాబర్ తుది జట్టులో ఆడించాడు. అతను కూడా బాగానే రాణించినా.. అబ్రార్‌ను ఆడించకపోవడంపై బాబర్‌పై విమర్శలు వచ్చాయి.
ఎట్టకేలకు రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కింది అబ్రార్. ఈ టెస్టుతో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అయితే.. అబ్రార్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోని వచ్చింది.. ముల్తాన్ స్టేడియంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ టెస్టులో సెహ్వాగ్.. అప్పటి పాక్ బౌలర్ షక్లైన్ ముస్తాక్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టాడు. ఆ మ్యాచ్‌ను ఇంట్లో కూర్చోని తండ్రితో కలిసి చూస్తున్న ఆరేళ్ల వయసున్న అబ్రార్.. ముస్తాక్ బౌలింగ్ తప్పిదాలను గుర్తించి.. తండ్రికి చెప్పేవాడంటూ.. అలా వేయాల్సింది, ఇలా వేయకూడదంటూ అబ్రార్ చేస్తున్న రన్నింగ్ కామెంట్రీని భరించలేని అబ్రార్ తండ్రి.. అతన్ని వేరే రూమ్‌లో లాక్ చేశాడట.
First morning as a Test debutant 🌟
Abrar Ahmed becomes the 13th Pakistan bowler to take a five-wicket haul on Test debut 💫#PAKvENG | #UKSePK pic.twitter.com/OE1qqtkPsN
— Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022
What a ball to get your first Test wicket! 👏
Immediate impact by Abrar Ahmed 🎯#PAKvENG | #UKSePK pic.twitter.com/8tvnuGFzyo
— Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022