ప్రముఖ రాజకీయ నేతలు బహిరంగ ప్రదేశాల్లో ప్రసగించినప్పుడో లేదా రోడ్ షో నిర్వహించినప్పుడో కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తారు. నాయకుల కాన్వాయ్ లపై రాళ్లు విసురుతుంటారు. తాజాగా చంద్రబాబు నాయుడి కాన్వాయ్ పై కూడా రాళ్లు విసిరారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందిగామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో ప్రారంభించారు. అయితే రోడ్ షో కొనసాగుతుండగా చంద్రబాబు నాయుడి కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరాడు.
ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గాయపడినట్లు తెలుస్తోంది. రాయి విసిరే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటనకు ముందు రోడ్ షో త్వరగా ముగించాలని పోలీసులు చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు వినలేదని, దీంతో అదనంగా పోలీస్ బలగాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పోలీస్ వర్గాల వారు వాదిస్తున్నారు. ఈ ఘటనకు ముందు పోలీసులతో టీడీపీ పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.