జగన్ అన్న వదిలిన బాణం షర్మిల అయితే.., ఆయన అంబుల పొదిలో ఉన్న మరో బాణం ఎమ్మెల్యే రోజా. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పై రోజా చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ఒకానొక సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఆమె టీడీపీ నాయకులపైనే రెచ్చిపోయింది. అప్పటి స్పీకర్ ఏకంగా రోజాని అసెంబ్లీ నుండి కూడా సస్పెండ్ చేశారంటే.. పార్టీ కోసం రోజా పడ్డ కష్టాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రోజా ఆత్మీయ సోదరి. ఆమెని రోజామ్మ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు జగన్. ఇన్ని సానుకూలతలు ఉండటంతో 2019లో నగరి ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కడం ఖాయమని అంతా అనుకున్నారు.
అప్పట్లో చిత్తూరు జిల్లా సామాజిక సమీకరణ లెక్కలు రోజా ఆశలపై నీళ్లు పోశాయి. కానీ.., అప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి తన ఆత్మీయ సోదరిని వదిలేయలేదు. రోజాకి క్యాబినెట్ హోదా కలిగిన ఏ.పి.ఐ.ఐ.సి ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయినప్పటికీ రోజా సంతృప్తి చెందకపోవడంతో.., సీఎం జగన్ స్వయంగా రోజాతో మాట్లాడి తదుపరి విస్తరణలో తప్పకుండా అవకాశం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇక త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. దీంతో.., ఈసారి రోజా భవితర్యం ఏమిటన్న చర్చ తెరపైకి వచ్చింది.
మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ రోజా మాత్రం పార్టీకి విధేయురాలిగానే ఉంటూ వస్తోంది. ఇటీవల ఆమె పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు కూడా. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజాని అభినందించారు . ఇక తిరుపతి ఉప ఎన్నికల సమయానికి ఆమె అనారోగ్య కారణాలతో సర్జరీ చేయించుకున్నారు. సో.. పార్టీ విధేయురాలుగానే రోజాకి పేరుంది. కానీ.., జిల్లాలో సీనియర్ నాయకులు అయిన.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో రోజాకు పెద్దగా సఖ్యత లేదన్న ప్రచారం సాగుతోంది. కానీ.., ఈ విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని.., జిల్లా నాయకులని ఒప్పించి రోజాకి మంత్రి పదవి ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే.. రోజాకి సినిమాటోగ్రఫీ శాఖ దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి.., ఈవిషయంలో ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.