భారతదేశంలో క్రీడలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో మంది క్రీడాకారులు తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాక రాజకీయాల్లోకి అడగుపెట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ క్రికెటర్ల భార్యలు, సోదరీమణులు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్బాలు చాలా అరుదు. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకేంటి మరి సంతోషమే కదా అని అనుకుంటున్నారా? ఇక్కడే ఓ తిరకాసు ఉంది అదే నియోజకవర్గం నుంచి కాంగ్రేస్ తరపున జడేజా సోదరి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. దాంతో ఇటు భార్య అటు సోదరి పోటీలో ఉండటంతో అయోమయంలో పడ్డాడు జడ్డూ భాయ్.
రవీంద్ర జడేజా.. ప్రత్యర్థి బ్యాటర్లను తన బంతులతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. కానీ ప్రస్తుతం రాజకీయలు వేసిన బాల్ కు క్లీన్ బౌల్డ్ అయ్యేలా ఉన్నాడు జడ్డూ భాయ్. వివరాల్లోకి వెళితే.. జడేజా భార్య అయిన రివాబా జడేజా కు బీజేపీ MLA టికెట్ ఇచ్చింది. దాంతో జడేజా సైతం తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక రివాబా జామ్ నగర్ నార్త్ నుంచి బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపాడు జడేజా. అంతా బాగానే ఉందనుకునే లోపే బాంబులాంటి వార్త గుజరాత్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే జడేజా భార్యకు పోటీగా కాంగ్రేస్ తరపునుంచి జడ్డూ భాయ్ సోదరి నైనా జడేజాను బరిలోకి దింపుతున్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇక ఇదే జరిగితే జడ్డూ పరిస్థితి ఏంటా అని అటు అభిమానులు, ఇటు ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్టు ద్వారా జడేజా దంపతులు పలు సేవా కార్యక్రమాను నిర్వహిస్తున్నారు. దాంతో అక్కడ వారికి మంచి పేరుంది. రివాబాకు పోటీగా నైనా జడేజాను బరిలోకి దింపితేనే బాగుంటుందని కాంగ్రేస్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇక గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మెుదటి విడతలో డిసెంబర్ 1న 89 నియోజకవర్గాలకు, డిసెంబర్ 5న రెండవ విడతలో 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాలను డిసెంబర్ 8న ప్రకటిస్తారు.