కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సర్కారీ బడుల స్వరూపాన్ని మార్చే దిశగా సీఎం కంకణం కట్టుకున్నారు. ఇక ఇప్పటికే కేటీ టూ పీజీ వరకూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఇదే వరకే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారట. అయితే ఏపీలో నాణ్యమైన విద్యను అందించేందుకు వచ్చే నెల నుంచి ఈ అంశానికి సంబంధించి విద్యా అధికారులు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీతో పాటు ఎల్కేజీ, యుకేజీ, మొదటి, రెండో తరగతులను ఫౌండేషన్ తరగతులుగా విభజించనున్నారు.
ఇక ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చుదిద్దే దిశగా సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలో ఈ జాతీయ విద్యా విధానం అమలుపై విద్యా అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో మరింత లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా సర్కారీ బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందనుంది. మరి దీనికి సంబంధించి భవిష్యత్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.
