బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది. ఇక తొలి ఎపిసోడ్‌కే ఎవరు ఊహించని సెలబ్రిటీని గెస్ట్‌గా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, లోకేష తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో.. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక షోలో బాలయ్య.. తన బావకు అన్ని రకాల ప్రశ్నలు సంధించారు. మరీ ముఖ్యంగా షోలో 1995 నాటి పరిస్థితులు ప్రస్తావనకు రావడం.. చంద్రబాబు ఇచ్చిన సమాధానం గురించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఇదే అంశంపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. బాలకృష్ణ.. చంద్రబాబును ఇంటర్వ్యూ చేయడంపై ఘాటుగా స్పందించారు. మహామనిషి ఎన్టీఆర్ మృతి చెంది 25 సంవత్సరాలు గడిచానా.. ఇప్పటికి చంద్రబాబు.. షోల పేరుతో ఆయనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘నందమూరి బాలకృష్ణకు సిగ్గుందా.. తన తండ్రి చావుకు కారణమైన చంద్రబాబు ఫ్యామిలీతో షోలు చేయడానికి సిగ్గు ఉండాలి. చంద్రబాబు నాయుడు గతిలేక అనేకసార్లు గతంలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారు. ఆయన కాళ్ల దగ్గరే ఉండి చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌కు పార్టీ నడపడం చేతకాకపోతే.. చంద్రబాబు బయటకు పోవాలి. అంతేతప్ప.. ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కోవడం ఏంటి. ఎన్టీఆర్‌ను మించి ఆయన కుమారుడు బాలయ్య నటిస్తున్నారు’’ అంటూ కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాక మహానటుడు ఎన్టీఆర్ మరణించి 25 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ చంద్రబాబు షోల పేరుతో ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభ పెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.