హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అందరూ ఊహించిన విధంగానే ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 23,865 ఓట్ల మెజారిటీతో ఈటల విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఓటమి తెలియని నాయకుడిగా ఈటల రికార్డు నమోదు చేశారు. జహీరాబాద్ నుంచి ఏడుసార్లు వరుసగా విజయం సాధించిన బాగారెడ్డి రికార్డును ఈటల సమం చేశారు. ‘చంపుకుంటారా? సాదుకుంటారా? మీ ఇష్టం అన్న ఈటలను.. సాదుకుంటామంటూ హుజూరాబాద్ ప్రజలు చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తే.. ఈటల రాజకీయ ప్రస్థానం 2002లో ప్రారంభమైంది. అప్పటి వరకు పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్న ఈటల.. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. అనూహ్యంగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేయాల్సిందిగా అధినేత కేసీఆర్ కోరడంతో బరిలోకి దిగారు. 2004లో టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోధర్ రెడ్డిపై విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో 2008లో ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి ఉప ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ అద్భుత విజయం సాధించారు. పునర్విభజన సందర్భంగా కమలాపూర్ నియోజకవర్గం రద్దు కావడంతో.. ప్రత్యేకంగా ఏర్పడిన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల పోటీ మొదలు పెట్టారు. 2009 నుంచి 2021 వరకు సాధారణ, ఉప ఎన్నికల్లో ఐదుసార్లు హుజూరాబాద్ ప్రజలు అప్రతిహితంగా ఈటల రాజేందర్‌ను గెలుపించారు.
తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండుసార్లు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానంతో చెడటంతో ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా ఉప పోరులో ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఈటల ఆరుసార్లు టీఆర్‌ఎస్, ఒకసారి బీజేపీ తరఫున విజయం సాధించారు. ఏడుసార్లలో కేవలం రెండుసార్లు(2008 ఉపఎన్నిక, 2009 జనరల్ ఎలక్షన్స్) మాత్రమే 50 శాతానికి పైగా ఓట్లు పొందారు.