హైదరాబాద్- ఈ మధ్యకాలంలో సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. కోప తాపాలకు, క్షణికావేశాలకు కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. భర్యా భర్తల మధ్య చిన్న చిన్న తగువులకే ప్రాణాల మూదకు తెచ్చుకునే వివాదాలు చలరేగుతున్నాయి. భర్త ప్రవర్తనపై విసుగు చెందిన ఓ భార్య పిల్లలను హత్య టేసి, తాను ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఓ కన్న తల్లి అభం శుభం తెలియని తన చిన్నారులను దారుణంగా హత్య చేసి తాను బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వాతి, సాయి కుమార్ దంపతులకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి శ్రేయ, తన్విక్ అని ఇద్దరు పిల్లలున్నారు. భార్యా భర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సాయికుమార్ భార్యను అనుమానంతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కూడా భర్తతో గొడవ జరిగింది.
విసుగుచెందిన స్వాతి, భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత పిల్లల్ని చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసి గోడపై అతికించింది. సాయి కుమార్ ఒక సైకో అని.. తనను ఎప్పుడూ వేధింపులకు గురి చేస్తుండే వాడని అందులో రాసింది. పిల్లలను కూడా సరిగా చూసేవాడు కాదని.. వారి కోసం ఏమీ చేయలేదని చెప్పుకొచ్చింది స్వాతి. తాను ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడినా కూడా సాయి ఇబ్బందులకు గురి చేశేవాడని.. ఒక సైకో లాగా ప్రవర్తించేవాడని ఆరోపించింది.
తనకు పిల్లలంటే పిచ్చి అని.. తను చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకోరని అందుకే చంపుకున్నానంటూ స్పష్టం చేసింది స్వాతి. భర్త వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్వాతి సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. స్థానికులు అందించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సాయి కుమార్ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.