ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీ ముందస్తుకు వెళ్లబోతోందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గడపగడపకు వైఎస్సార్ సీపీ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. మరింత జనాల్లోకి వెళ్లటానికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరిట అధికార పార్టీ మరో కార్యక్రమాన్ని చేపట్టబోతోందట. వైఎస్సార్ సీపీ బలం, బలగం వైఎస్ జగన్ కాబట్టి ఆయన పేరు మీద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గడపలకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ పోస్టర్లను అంటించనుందట. అంతేకాదు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లనున్నారట. ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
బస్సు యాత్రలో భాగంగా ప్రతీ మండలంలో జగన్ పర్యటించనున్నారట. పల్లె నిద్రలు కూడా చేయబోతున్నారట. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించనున్నారట. ఇక, ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్‌తో ‘యువగళం’ పేరిట ఓ యాత్ర చేపట్టారు. నారా లోకేష్ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడకక్కడా సభలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను, తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఏపీలో మరో ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న జనసేన కూడా వచ్చే ఎన్నికల కోసం సిద్ధమైంది. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. అతి త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానని ప్రకటించారు.
ఇలా మూడు పార్టీలు వాయు వేగంతో ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకోవటం ముందస్తు ఎన్నికలకు సూచనగా భ్రమ కలుగుతోంది. ముందస్తుకు వెళ్లాలన్న ఆలోచనతోటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని, ఈ విషయం తెలిసిన టీడీపీ, జనసేనలు కూడా ముందుకు దూకాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో చాలా సార్లు ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవంటూ టీడీపీ ప్రచారం చేసినా అవి ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా వ్యవహరించటానికి ముందుస్తు ఎన్నికలే కారణమా? లేక 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? లేదా? అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.