మనిషి శాస్త్ర సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికి.. మనుషలు మధ్య అంతరాలు మాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి చెందుతున్న కొద్ది.. ఈ అంతరాలు పెరుగుతుండటం పట్ల ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సమాజంలో కుల వైషమ్యాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా దళితుల మీద దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మనుషులంతా సమానమే అని బోధించాల్సిన పాఠశాలలో దళిత మహిళ వండిన ఆహారం తాము తినమని తేల్చి చెప్పారు విద్యార్థులు. ఆ వివరాలు..
ఉత్తరాఖండ్ లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే వ్యక్తిని భోజనమాతగా పిలుస్తారు. ఈ క్రమంలో చంపావత్ జిల్లా సుఖీదంగ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో భోజనమాత గా దళిత మహిళ సునీతా దేవిని నియమించారు. పాఠశాలలో చదువుతున్న ఉన్నత సామాజిక వర్గం విద్యార్థులు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దళిత మహిళ వండిన భోజనాన్ని తాము తినమని తేల్చి చెప్పడమే.. ఇంటి నుంచే మధ్యాహ్నం భోజనం క్యారియర్ తెచ్చుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో మాట్లాడినప్పటికి ప్రయోజనం లేకపోయింది. తప్పును సరిదిద్దాల్సిన విద్యాశాఖ అధికారి దళిత మహిళ సునీతా దేవిని విధుల నుంచి తొలగించి.. ఆమె స్థానంలో మరో బ్రాహ్మణ మహిళను భోజనమాతగా నియమించారు. ఉన్నతాధికారులు ప్రమేయం లేకుండానే ఈ నియమాకం జరిగింది. ఈ వ్యవహారం కాస్త బయటకు లీక్ అవ్వడంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు సునీతా దేవికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
