న్యూ ఢిల్లీ- నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులోను పెట్రోల్, డీజిల్ ధరలైతే ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు వంద రూపాయలు దాటింది. దీంతో మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఐతే ప్రతి రోజు ఎంతో కొంత పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది.
ఈరోజు ప్రభుత్వ చమురు సంస్థలు వాహనదారులకు శుభవార్త చెప్పాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15పైసలు చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గత 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇది రెండవసారి. వారం రోజుల వ్యవధిలో డీజిల్ ధర ఐదుసార్లు తగ్గింది. ఆగస్టు 18 తరువాత డీజిల్ ధర ఐదుసార్లు తగ్గింది. దీనిలో నాలుగుసార్లు లీటరుకు 20 పైసలు చొప్పున తగ్గుతూ వచ్చింది. ఐదవసారి 15 పైసలు తగ్గింది. దీంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది.
ఢిల్లీలో ఈరోజు తగ్గిన పెట్రోల్ ధర 101.49 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు 88.92 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడమే కాకుండా, కొంతమేరకు తగ్గుతూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిళ్లీ పెట్రోల్ ధర 101.49, డీజిల్ ధర 88.92 గా ఉంది. ముంబయి పెట్రోల్ ధర 107. 52, డీజిల్ ధర 96.48 గా ఉంది. కోల్ కత్తా పెట్రోల్ ధర 101.82, డీజిల్ ధర 91.98 గా ఉంది. చెన్నై పెట్రోల్ 99.20, డీజిల్ 93.52 గా ఉంది. బెంగళూరు లో పెట్రోల్ 104.98, డీజిల్ ధర 94.34 గా ఉంది. ఇక మన హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 105.69 రూపాయలు, లీటరు డీజిల్ ధర 97.15 రుపాయలుగా ఉంది.