తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి తేల్చేశారు. ధరల పెంపు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. టికెట్ ధరలను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ… ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు చొప్పున పెంపుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు.
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ… టికెట్ ధరలను పెంచి రెండేళ్లయిందని చెప్పారు. టికెట్ ఆదాయం పైనే ఆర్టీసీ ఆధారపడి ఉందని తెలిపారు. పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారంగా పరిణమించాయని తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై అదనంగా రూ. 468 కోట్ల భారం పడుతోందని సజ్జనార్ తెలిపారు. ఈ ఏడాది రూ. 1,400 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని చెప్పారు.