కోయంబత్తూరు- ప్రతి రోజు మనం ఎక్కడో ఓ చోట హత్య లేదంటే అత్యాచారం జరిగిందని వింటూనే ఉంటాం. ఐతే సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇలా అత్యాచారాలు జరిగితే పరిస్థితి ఎంత దిగజారిపోతోందో వేరే చెప్పక్కర్లేదు. అవును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాయుసేనలో ఓ మహిళా అధికారణిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
భారత వాయుసేనలో శిక్షణలో ఉన్న యువ మహిళా అధికారిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్ వాయుసేన శిక్షణ కళాశాలలో జరిగింది. పది రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అధికారిఅరెస్ట్‌ను దీపక్ దమన్ అనే సీనియర్ పోలీస్ అధికారి నిర్ధారించారు.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళా అధికారిణి, తమిళనాడులోని కోయంబత్తూరు రెడ్ ఫీల్డ్ ఎయిర్ ఫోర్స్ ట్రెయినింగ్ కాలేజీలో గత కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 10న ట్రైనింగ్ సమయంలో ఆమె స్వల్పంగా గాయపడింది. దీంతో గాయానికి చికిత్స తీసుకున్న తరువాత, తన గదిలో రెస్ట్ తీసుకుంటోంది. ఆమెపై ఎప్పటి నుంచో కన్ను పడి, అదే కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్న చత్తీస్ గఢ్ కు చెందిన 29 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అమీర్ దేశ్ ఆమె గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు.
సదరు మహిళా అధికారిణి ఎంతలా బతిమాలినా ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడా దుర్మార్గుడు. ఈ ఘటనపై బాధితురాలు వాయుసేన అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. దీంతో రెండు రోజుల క్రితం కోయంబత్తూరు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన గాంధీపురం మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు, నిందితుడు అమీర్ దేశ్ ను ఆదివారం అరెస్ట్ చేశారు.
ఆ తరువాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నిందితుడు అమీర్ దేశ్ ను ప్రస్తుత ఉదుమాల్ పేట్ జైలుకు తరలించారు. సదరు అధికారిపై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశామని కోయంబత్తూరు పోలీస్ అధికారి దీపక్ దమన్ చెప్పారు. తదుపరి విచారణ కోసం అతడిని పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతామని ఆయన తెలిపారు.