బిజినెస్ డెస్క్- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. వరుసగా నాలుగు రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ శనివారం కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధర 35 పైసల చొప్పున పెరిగింది.
గత సంవత్సరం 2020 మే ప్రారంభం నుంచి గమనిస్తే లీటరు పెట్రోల్ ధర 36 రూపాయలు, లీటరు డీజిల్ ధర 26.58 రూపాయలు పెరిగింది. సంవత్సరన్నర కాలంలో ఇంత భారీ స్థాయిలో చమురు ధరలు పెరిగిపోవడం పట్ల వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తాజా ఇందన ధరల పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 107.24 రూపాయలకు చేరగా, డీజిల్ ధర 95.97 రూపాయలకు చేరుకుంది.
మే 2020, 5న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రికార్డు స్థాయిలో పెంచింది. మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచకపోయినట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు తగ్గేవి. దీంతో వాహనదారులకు మరింత చవకగా పెట్రోల్ . డీజిల్ ధరలు అందుబాటులో ఉండేవి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడంతో వాహనదారులపై భారం పడుతోంది.
గత సంవత్సరం మే 5 నుంచి ఇప్పటి వరకు లీటరు పెట్రోల్ ధర 35.98 రూపాయలు, లీటరు డీజిల్‌పై 26.58 రూపాయలు పెరిగింది. లీటరు పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం 32.9 రూపాయలు, లీటరు డీజిల్ పై 31.8 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 85 డాలర్లకు పెరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.