దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరు అరెస్ట్ అయినా ఇక పదవి కోల్పోవల్సిందే. ఈ బిల్లుపై ప్రస్తుతం విపక్షాలు తీవ్ర ఆందోళన సంగతి ఎలా ఉన్నా..అసలీ కొత్త బిల్లు ఏం చెబుతోంది. ఏం జరగనుందో తెలుసుకుందాం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది. ఆర్టికల్ 370, సీఏఏ, వక్ఫ్ బిల్లు తరహాలోనే మరో సంచలన బిల్లును తీసుకొచ్చింది. ఇదే పీఎం రిమూవల్ బిల్లు. ఈ బిల్లు ప్రకారం ఇకపై కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి 30 రోజులు నిర్బంధంలో లేదా అదుపులో ఉంటే స్వఛ్చందంగా పదవి నుంచి తప్పుకోవల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుకోకుంటే బిల్లు ప్రకారం పదవి కోల్పోతారు. తీవ్రమైన నేరారోపమలు ఎదుర్కొంటూ జైళ్లకు వెళ్లినా పదవిలో కొనసాగుతుండటంతో ప్రజల్లో విశ్వాసం పోతోందని, ఇదంతా పరిపాలనపై దుష్ప్రభావం చూపుతుందనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అందుకే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు కేంద్రం చెబుతోంది. కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పొందే కేసులో నెల రోజులు అరెస్ట్ అయినా లేక కస్టడీలో ఉన్నా ఈ చట్టం వర్తిస్తుంది.
విపక్షాల అభ్యంతరాలేంటి
ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చిందనేది విపక్షాల తీవ్ర అభ్యంతరంగా ఉంది. తప్పుడు ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి..ఆ నేరం రుజువు కాకుండానే కేవలం అరెస్ట్ ఆధారంగా పదవుల నుంచి తొలగించేందుకు వాడుకుంటారని ఆరోపిస్తోంది. ఈ చట్టం వల్ల పోలీసులకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉద్దేశ్యపూర్వకంగా కేసులు బనాయిస్తారనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధుల్ని దారిలో తెచ్చుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి.
పార్లమెంటులో ఏం జరిగింది
ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ ప్రవేశపెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుతో పాటు ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లుల్ని కూడా విపక్షాలు వ్యతిరేకించాయి. పీఎం రిమూవల్ బిల్లు కాపీల్ని చింపి కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విసిరేశారు. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరుగుతుండటంతో స్పీకర్ సభను మద్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.