ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సాధారణంగా వస్తుంటాయి, వెళ్తుంటాయి. బాధలు ఎక్కువైనపుడు తీవ్ర మనోవాధనకు గురవుతుంటారు. బాధలను పంచుకునే వారికోసం ఎదురుచూస్తుంటారు.
కొందరు తమ మనసులోని బాధను బయటికి వ్యక్తపరిచి కాస్త ఉపశమనం పొందుతారు. ఇదే విధంగా ఓ తల్లి తనకు కలిగిన బాధను వివరించేందుకు వినూత్నంగా ఆలోచించింది. ఏకంగా పోలీసుల ఎదుటే రోడ్డుపై నోట్లను విసిరి నిరసన తెలిపింది. ఈ హఠాత్పరిణామంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ పెద్దావిడ అలా చేయాడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిదండ్రులను పిల్లలు పెరిగి పెద్దైన తరువాత వారి ఆలనా పాలనా చూసుకోకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు నిరాశ మిగులుస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టకుండా అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ తల్లి తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగింది. రోడ్డుపై నోట్లు వెదజల్లి తన బాధను వ్యక్తపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ పెద్దావిడకు ఓ కొడుకున్నాడు. అయితే అతడు తల్లిని పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాడు.
దీంతో విసుగెత్తిన ఆ పెద్దావిడ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీస్ అధికారులు ఆమె కొడుకుపై ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత పోలీస్ అధికారులు తన గోడును వినిపించుకోవట్లేదని విసుగు చెందిన ఆ పెద్దావిడ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. పోలీసులు తన కొడుకు వద్ద నుంచి డబ్బులు తీసుకుని తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. అక్కడితో ఆగకుండా తన వద్ద ఉన్న ఐదు వందల రూపాయల నోట్లను రోడ్డుపై వెదజల్లింది. ట్రాఫిక్ ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ తల్లి గోడును పోలీసులు ఇప్పటికైనా ఆలకించి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.