అన్నీ అవయవాలు పనిచేస్తూ కూడా కొన్ని సార్లు చిన్న సమస్యలకే చితికి పోతాం. తమకు ఎందుకిలా జరిగిపోతుందని ఆవేదన చెందుతాం. మరీ విభిన్న ప్రతిభావంతుల పరిస్థితి ఏంటీ. కానీ వారు తమను తాము నిరూపించుకుంటున్నారు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు దరియా.
శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తుంటేనే.. కాస్త పనికే అలసట చెందుతాం. ఇంట్లో పనుల దగ్గర నుండి ఆఫీసుల్లో ఉద్యోగం చేసే వరకు సాకులు చెబుతూనే ఉంటాం. చిన్న సమస్య వచ్చినా కుంగిపోతుంటాం. తమకే ఎందుకిలా జరుగుతుందని ఆవేదన చెందుతాం. కానీ విభిన్న ప్రతిభావంతులు మాత్రం తమను తాము నిరూపించుకుంటున్నారు. కళ్లు, కాళ్లు, చేతులు, నోరు, చెవులు వీటిల్లో ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా ఏం లెక్కచేయడం లేదు. తాము సాధించాలనుకుంటున్నది సాధిస్తున్నారు. పది మందికి ఆదర్శంగా నిలస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు ఇరాన్‌కు చెందిన 22 ఏళ్ల దరియా. ఆమె పాక్షికంగా అంధురాలు. అయితే తాను ఇంట్లోనే అలా ఉండిపోకుండా.. తన లాంటి వారి కోసం ఓ యాత్రకు నడుం బిగించింది.
ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అవగాహన కల్పించేందుకు ప్రపంచ యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 2021 డిసెంబర్‌లో ఆర్మేనియాలో తన యాత్ర ప్రారంభించింది. ఏడాది పాటు పలు దేశాలు చుట్టి అవగాహన కల్పించిన దరియా.. వాఘ సరిహద్దు గుండా పాకిస్తాన్ నుండి భారత్ లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలలు నేరవెర్చుకోవడానికి అంగవైకల్యం అడ్డంకి కాదని పేర్కొంది. తాను మధ్య ఇరాన్‌లోని ఇస్ ఫహాన్ నగరంలో గత అయిదేళ్లుగా ఎవ్వరిపై ఆధారపడకుండా జీవిస్తున్నట్లు తెలిపింది.అక్కడ భాషోధ్యాయినిగా, ప్రేరణ సలహాదారుగా వ్యవహరిస్తున్న దరియా విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం బలమని పేర్కొంది. మన బలాలను ఉత్తమ మార్గంలో పెడితే ప్రపంచానికి మంచి చేయగలమని చెప్పింది. ప్రత్యేక ప్రతిభా వంతుల దినోత్సవం గురించి తాను విన్నప్పుడు ఈ యాత్ర చేపట్టాలని అనుకున్నట్లు తెలిపింది.
ఈ యాత్ర చేపట్డం ముఖ్య ఉద్దేశం రేపటి కోసం విజ్ఞానం, మంచి ఆలోచనలను పంచుకోవడమేనని దరియా పేర్కొంది. ఈ యాత్ర చేపట్డం పట్ల తన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారని పేర్కొంది. తాను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానని, తనకు విభిన్న ప్రతిభావంతుల కుటుంబాలు అండగా నిలుస్తున్నట్లు తెలిపింది. ఇరాన్, టర్కీ, పాకిస్తాన్ లో అవగాహన కల్పించానని, అక్కడ మంచి స్పందన వచ్చినట్లు చెప్పింది. పాకిస్తాన్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయలేదని గుర్తు చేసుకుంది. దయా, మానవత్వాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దని తన సందేశమని తెలిపింది. ఇప్పుడు భారత్ లో కూడా పర్యటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని సక్రమంగా ఉండీ ఏమీ చేయలేని వారిని పక్కన పెడితే.. ఇలా తన లాంటి వారికోసం ప్రపంచ యాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్న ఆమె సాహసం అభినందనీయం. దరియా చేస్తున్న యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.