ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రజలు ఏవేవో చేస్తుంటారు. వ్యాయామం చేయడం, బలమైన భోజనం తినడం, సమయానికి నిద్రపోవడం లాంటివి చేస్తుంటారు. కొందరైతే ఓ పూట భోజనం కూడా మానేస్తారు. అయితే ఓ వ్యక్తి సాధారణ ప్రజలు తీసుకునే ఆహారం తినకుండా కొన్నేళ్ల నుంచి బతుకుతున్నాడు.
కరోనా పుణ్యాన ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ బాగా పెరిగింది. హెల్తీగా ఉండటం ఎంత ముఖ్యమో మహమ్మారి కారణంగా తెలిసొచ్చింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, ఫిట్‌గా ఉండటం ఎంత అవసరమనేది జనాలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు చేయవలసినవన్నీ చేస్తున్నారు. ఫ్యాట్ తక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్‌ను తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ఈమధ్య కాలంలో ఎక్కువైంది. ఇక, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ విషయానికొస్తే.. వాళ్లు ఫిట్‌గా ఉండేందుకు ఏమైనా చేస్తారు.
రెగ్యులర్‌గా వర్కవుట్లు చేయడం, బలమైన పౌష్టికాహారం తీసుకోవడం, మంచి నిద్ర తీసుకుంటూ బాడీని మంచి షేప్‌లో ఉంచుకుంటారు. కొంతమంది ఫిట్‌నెస్ కోసం ఒకపూట తినడం కూడా మానేస్తుంటారు. అయితే ఎవరైనా కేవలం నీళ్లు మాత్రమే తాగి జీవించగలరంటే నమ్మగలరా? అవునండీ ఇది నిజం. ఒక వ్యక్తి గత 24 ఏళ్లుగా కొబ్బరినీళ్లు, కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. అయినా ఆయన మాత్రం ఆరోగ్యంగానే ఉన్నాడు. వయసు పైబడినప్పటికీ ఆయన మొహంలో అదే మెరుపు కనిపిస్తోంది. ఆయన పేరే బాలకృష్ణన్. గత 24 ఏళ్లుగా ఆయన కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షహనాజ్ ట్రెజరీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బాలకృష్ణన్ కథను షేర్ చేశారు.
ఇరవై నాలుగేళ్లుగా ఓ వ్యక్తి ఎలాంటి భోజనం తినకుండా.. కేవలం కొబ్బరి నీళ్లు తాగుతూ, కొబ్బరిని తింటున్నాడని తెలిసి షాక్ అయ్యానని షహనాజ్ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. కొబ్బరి తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను బాలకృష్ణన్ వివరించే వీడియోను కూడా అందరితో పంచుకున్నారు. ఆ వీడియోలో బాలకృష్ణన్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు షహనాజ్. కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారని బాలకృష్ణన్ ను ప్రశ్నించారు షహనాజ్. ఈ క్వశ్చన్‌కు బాలకృష్ణన్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం విషయంలో తలెత్తిన ఓ సమస్య వల్లే ఇలా చేయాల్సి వచ్చిందన్నాడు.
‘24 ఏళ్ల కింద నా కడుపులో గ్యాస్ (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి GERD) సంబంధిత సమస్యను ఎదుర్కొన్నా. ఆ వ్యాధి వల్ల నా శక్తినంతా కోల్పోయా. ఆ తర్వాత అకస్మాత్తుగా కొబ్బరినీళ్లు మాత్రమే తాగాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నా’ అని బాలకృష్ణన్ జవాబిచ్చాడు. బాలకృష్ణన్ కొబ్బరినీళ్ల కథ గురించి తెలిసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొబ్బరి తీసుకుని ఇన్నేళ్లు ఎలా బతికాడని షాక్ అవుతున్నారు. కొబ్బరిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయనేది తెలిసిందే. వీటి కారణంగా ఆయన ఆరోగ్యం బలపడి ఉండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, బాలకృష్ణన్ కథ విన్నాక మీకు ఏం అనిపించిందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.